Godawari Electric Scooters : ఆటో ఎక్స్‌పోలో 2 గోదావరి ఎలక్ట్రిక్ స్కూటర్లు.. మిడిల్ క్లాస్ వాళ్లకు పర్ఫెక్ట్!
Godawari Electric Scooters : భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో కొత్త స్కూటర్లు కూడా లాంచ్ అవుతున్నాయి. ఇందులో గోదావరి ఎలక్ట్రిక్ కంపెనీ రెండూ ఈవీ స్కూటర్లను విడుదల చేసింది. వాటి వివరాలేంటో చూద్దాం..
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ లిమిటెడ్.. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో రెండు కొత్త ఈవీలను తీసుకొచ్చింది. కంపెనీ Eblu FEO Z, Eblu FEO DX అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఫియో జెడ్ తక్కువ స్పీడ్ స్కూటర్‌గా రూపొందించారు. ఫియో డీఎక్స్ అద్భుతమైన పనితీరు, సింగిల్ ఛార్జ్‌కు 150 కిమీ రేంజ్ అందించేలా తయారుచేశారు.

కస్టమర్ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి కంపెనీ EbluCare యాప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ వినూత్న స్మార్ట్‌ఫోన్ యాప్ ఎలక్ట్రిక్ వాహనాల(EV) సులభ నిర్వహణ కోసం రూపొందించారు. ఈ యాప్ వినియోగదారులకు సౌలభ్యం, కనెక్టివిటీతో మంచి అనుభవాన్ని ఇస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
'కొత్త స్కూటర్ల ఆవిష్కరణ భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్‌లో మా ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. రీజెన్ బ్రేకింగ్, అధునాతన బ్యాటరీ నిర్వహణ వ్యవస్థలు, అత్యుత్తమ నాణ్యత, మంచి ఫీచర్లతో ఈ వాహనాలు ఉపయోగకరంగా ఉంటాయి.' అని గోదావరి ఎలక్ట్రిక్ కంపెనీ తెలిపింది.
ఈబ్లూ ఫియో డీఎక్స్ ఫీచర్లు
ఈబ్లూ ఫియో డీఎక్స్ అనేది 5.0 kW పీక్ పవర్ మోటార్‌ను కలిగి ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ మోటార్ గరిష్టంగా 140 Nm టార్క్‌ని విడుదల చేస్తుంది. గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. స్కూటర్ 11-డిగ్రీ గ్రేడియంట్‌కు మద్దతు ఇస్తుంది. ఎకానమీ, నార్మల్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, 7-అంగుళాల TFT స్క్రీన్ ఉంటాయి. స్కూటర్‌లో 28-లీటర్ బూట్ స్పేస్ ఉంది. 4.2 కిలోవాట్ బ్యాటరీని దాని 60V 20 amp హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 3.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.
ఈబ్లూ ఫియో జెడ్
ఈబ్లూ ఫియో జెడ్ విశాలమైన 25-లీటర్ బూట్ స్పేస్‌తో ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. డ్యూయల్ ఎల్ఈడీ లైటింగ్‌తో వేరు చేయగలిగిన LMFP బ్యాటరీ సిస్టమ్ (48V/30Ah)ని కలిగి ఉంది. ఈ స్కూటర్ ఒక్కో ఛార్జింగ్‌కు 80 కి.మీ రేంజ్ ఇస్తుంది. వాహనంపై 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీల వారంటీ ప్యాకేజీ వస్తుంది. బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 50,000 కిమీల వారంటీ ఇస్తారు. ఈ స్కూటర్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని కంపెనీ త్వరలో చెప్పనుంది.