August IPOs: ఈ నెలలో ఇప్పటివరకు మార్కెట్లోకి ఏకంగా 19 ఐపీఓలు; 90 శాతం లాభాల్లోనే..
భారతీయ స్టాక్ మార్కెట్ ను ఐపీఓలు ముంచెత్తుతున్నాయి. ఆగస్ట్ నెలలో ఏకంగా 19 ఐపీఓలు దలాల్ స్ట్రీట్ లో అడుగుపెట్టాయి. అందులో 90 శాతం పైగా స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతుండడం విశేషం. దేశ బలమైన ఆర్థిక వ్యవస్థకు ఈ ఐపీఓలు సాధించిన విజయాలే రుజువులని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత సంవత్సరంలో సెకండరీ మార్కెట్ అడపాదడపా మందగమనాన్ని చవిచూసినప్పటికీ, ప్రాధమిక మార్కెట్ అలుపెరగని శక్తిని చూపించింది. బలమైన కార్యకలాపాలతో స్థిరంగా ముందుకు సాగుతోంది. ఈ ధోరణి 2023 నుండి స్థిరంగా కొనసాగుతోంది. ఈ స్థిరమైన వేగం భారత ఐపీఓ మార్కెట్ ను గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ హాట్ స్పాట్ గా మార్చింది.
జూలై లో 31 కంపెనీలు..
2024 ప్రథమార్థంలో ఐపీఓ కార్యకలాపాల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒక్క జూలైలోనే 31 కంపెనీలు తమ షేర్లను సెకండరీ మార్కెట్లో లిస్ట్ చేయగా, ఆగస్టు మొదటి రెండు వారాల్లోనే 19 కంపెనీలు స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టాయి. వాటిలో 18 కంపెనీలు ఇప్పుడు తమ ఇష్యూ ధర కంటే ఎక్కువగా ట్రేడవుతుండడం విశేషం.
మెయిన్ బోర్డ్ విభాగంలో
మెయిన్ బోర్డ్ విభాగంలో ఐదు కంపెనీలు మొత్తం రూ.13,725 కోట్లు సమీకరించగా, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ.6,145.6 కోట్లు, బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ రూ.4,193.7 కోట్లు, సీగల్ ఇండియా రూ.1,252.7 కోట్లు సమీకరించాయి. ఎస్ఎంఈ విభాగంలో 14 కంపెనీలు ప్రస్తుత నెల మొదటి రెండు వారాల్లో మొత్తం రూ.522.8 కోట్లు సమీకరించాయి. మెయిన్ బోర్డ్ సెగ్మెంట్ తో కలిపితే రెండు విభాగాల్లో సమీకరించిన మొత్తం నిధులు రూ.14,247 కోట్లకు చేరుకున్నాయి.
ఇన్వెస్టర్ల నుంచి అద్భుత స్పందన
ఈ ఐపీఓ లలో దాదాపు అన్నింటికీ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఆగస్ట్ తొలి రెండు వారాల్లో లిస్ట్ అయిన 19 ఐపీఓలలో 13 సబ్స్క్రిప్షన్ రేట్లు 100% కంటే ఎక్కువ సాధించాయి. ఎస్ఏ టెక్ సాఫ్ట్వేర్ ఐపీఓ 558 రెట్లు, ట్రామ్ ఇండస్ట్రీస్ 430 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. టాప్ పెర్ఫార్మర్స్ లో, రాజపుతానా ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం వాటి ఇష్యూ ధర కంటే 142% ఎక్కువగా ట్రేడవుతోంది. ఆఫ్కామ్ హోల్డింగ్స్ స్టాక్ దాని ఐపీఓ ధర కంటే 109% ఎక్కువగా ట్రేడవుతోంది.
రిటైల్ ఇన్వెస్టర్లదే హవా..
ఐపీఓ మార్కెట్ పై ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆన్ లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల ఐపీఓలకు సబ్ స్క్రైబ్ చేయడం రిటైల్ ఇన్వెస్టర్లకు సులభమైంది. దానివల్ల ఐపీఓలు అధిక సబ్స్క్రిప్షన్ పొందాయి. ఈ ఐపీఓ (ipo)ల సక్సెస్ అంతర్జాతీయ సంస్థలను కూడా ఆకర్షించింది. ఉదాహరణకు, హ్యుందాయ్ ఇండియా తన ఐపీఓ ద్వారా 3 బిలియన్ డాలర్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇది 30 బిలియన్ డాలర్ల విలువతో భారతదేశంలో అతిపెద్దదిగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్జీతో పాటు పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా భారత్లో పబ్లిక్ లిస్టింగ్ కు సిద్ధమవుతున్నాయి.
ఎస్ఎంఈ లకు పెరుగుతున్న ఆసక్తి..
ఇదిలావుండగా, ఇన్వెస్టర్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమల (SME)లపై గణనీయమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ట్రెండ్ లైన్ డేటా ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 153 కంపెనీలు పబ్లిక్ అయ్యాయి. వాటిలో 117 కంపెనీలు ఎస్ఎంఈ సెగ్మెంట్ నుండి వచ్చాయి. అంటే దాదాపు 77%. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 67 శాతం అధికం. రుణాలను తిరిగి చెల్లించడం, విస్తరణ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేయడం మరియు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడం నిధుల సమీకరణ యొక్క ప్రాధమిక లక్ష్యాలు అని అనేక కంపెనీల డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) సూచిస్తున్నాయి
సూచన: ఈ వ్యాసంలో ఇచ్చిన అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. ఇవి హిందుస్తాన్ టైమ్స్ తెలుగు అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించవు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.