Audi RS Q8 Performance : లగ్జరీ ఫీచర్లతో ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
Audi RS Q8 Performance : ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ భారత్‌లో లాంచ్ అయింది. కంపెనీ దీన్ని 2.49 కోట్లు ధరకు లాంచ్ చేసింది. ఈ లగ్జరీ కారుకు సంబంధిచిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. తన హై-పెర్ఫార్మెన్స్ లగ్జరీ ఎస్యూవీ, ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ను భారత్‌లో విడుదల చేసింది. కొత్త ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ భారత్‌లో రూ. 2,49,00,000 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఈ కారు 10 సంవత్సరాల కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాజమాన్య ప్రయోజనంతో వస్తుంది.
'ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ భారతదేశానికి అత్యుత్తమ కార్లను తీసుకురావాలనే మా నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయి. కొత్త ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ లగ్జరీపై రాజీపడకుండా అత్యుత్తమ పనితీరును కోరుకునే కస్టమర్ల కోసం రూపొందించాం.' అని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు.
అదిరిపోయే ఫీచర్లు
ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ 8 స్టాండర్డ్, 9 ప్రత్యేక కలర్ ఆప్షన్లలో అందిస్తారు. దీని డిజైన్ ముందుగా కంటే మరింత స్పోర్టీగా మారింది. ఇందులో కంపెనీ కొత్త బంపర్లు, పెద్ద అలాయ్ వీల్స్ ఉంచింది. అదేవిధంగా కస్టమర్లకు షార్ప్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, DRLs లభిస్తాయి. ఇందులో డ్యూయల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. కస్టమర్లకు 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ టెల్గేట్, పనోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది.
మెరుగైన క్యాబిన్ సౌకర్యం కోసం ఎయిర్ అయానైజర్, ఫ్రాగ్రన్స్ ఫంక్షన్‌తో కూడిన 4-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. భద్రత కోసం 360-డిగ్రీల కెమెరా సిస్టమ్‌తో పార్క్ అసిస్ట్ ప్లస్ వస్తుంది. హెచ్డీ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్లైట్లు మంచి వెలుతురు అందిస్తాయి.
స్పీడ్‌లో తోపు
ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్లో 4.0-లీటర్ ట్విన్-టర్బో వీ8 ఇంజిన్ ఉంది. ఇది శక్తివంతమైన 640బీహెచ్పీ పవర్, 850ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆడి క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ టెక్నాలజీ, 8-స్పీడ్ ఏటీ గేర్‌బాక్స్ అందించారు. ఈ ఎస్యూవీ 0 నుండి 100 km/h వేగాన్ని కేవలం 3.6 సెకన్లలో అందుకుంటుంది. 305కేఎంపీహెచ్ స్పీడుతో దూసుకెళ్తుంది.
మార్కెట్లో ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్కు ప్రత్యక్ష పోటీగా లాంబొర్గిని ఉరస్ ఎస్ఈ, మసరతి గ్రెకాలే, పోర్షే కాయెన్ జీటీఎస్ వంటి హై-పర్ఫార్మన్స్ ఎస్‌యూవీలు ఉన్నాయి. మీరు లగ్జరీ, సూపర్‌ఫాస్ట్ ఎస్యూవీ కావాలంటే ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ బాగుంటుంది.