Child Insurance Policy: పిల్లల పేరుతో పాలసీలు, ఆస్తులు కొంటున్నారా..!ఈ జాగ్రత్తలు మరువకండి-are you buying policies and properties in the name of children dont forget these precautions ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Child Insurance Policy: పిల్లల పేరుతో పాలసీలు, ఆస్తులు కొంటున్నారా..!ఈ జాగ్రత్తలు మరువకండి

Child Insurance Policy: పిల్లల పేరుతో పాలసీలు, ఆస్తులు కొంటున్నారా..!ఈ జాగ్రత్తలు మరువకండి

Child Insurance Policy: తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో, తమకు ఏదైనా జరిగితే వారికి ఎలాంటి కష్టాలు రాకూడదని ఇన్స్యూరెన్స్‌ పాలసీలు, ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు. అయితే అలాంటి పాలసీలు, ఆస్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరువకూడదు.

పిల్లల పేరుతో బీమా పాలసీలు కొంటున్నారా ఈ విషయాలు మరువకండి..

Child Insurance Policy: జీవితంలో ప్రతి ఒక్కరు కష్టపడేది.. ఉద్యోగం, వ్యాపారంలో సంపాదించేది తమతో పాటు తమ వారసులకు అందించడం కోసమే. నేటి అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తుంటారు. వీటన్నింటి లక్ష్యం పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వారికి స్థిరమైన జీవితం కల్పించాలనే లక్ష్యంతోనే శ్రమిస్తుంటారు.

ఈ క్రమంలో కొత్తగా పెళ్లైన వారు పిల్లలు పుట్టిన వెంటనే బీమా ఏజెంట్లు చెప్పే మాటలకు పడిపోతుంటారు. “పిల్లల పేరుతో ఓ పాలసీ తీసుకోండి”అనగానే మంచిదేనని భావిస్తారు. పిల్లల పేరుతో బీమా పాలసీలు చేయడంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉటంుంది.

తల్లిదండ్రులు తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ పిల్లలకి ఎలాంటి కష్టం లేకుండా ఆర్థిక సహకారం అందేలా పాలసీలు చేయడం మంచిదే. అదే సమయంలో పిల్లలకు ఏదైనా జరిగితే తాము లాభపడాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ప్రస్తుతం ఇన్స్యూరెన్స్ కంపెనీలు పిల్లల పేరుతో పాలసీలు జారీ చేస్తున్నా వారికి నిర్ణీత వయసు వచ్చే వరకు కవరేజీ ఇవ్వడం లేదు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఇన్స్యూరెన్స్‌ పాలసీలు తీసుకోవడంలో పెద్దగా ఉపయోగం ఉండదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఉదాహరణకు కొత్తగా పెళ్లైన జంటకు ఓ బిడ్డ పుట్టగానే బీమా ఏజంటు మాటలతొ ఓ బీమా పాలసీ తీసుకున్నాడనుకుందాం... పాప పుట్టిన కొన్నేళ్లకు ప్రమాదంలో తండ్రి చనిపోతే ఆ పాలసీ పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలి. చనిపోయే నాటికి ఆ వ్యక్తి పేరుతో ఎలాంటి పాలసీ లేకపోతే ఆ కుటుంబం రోడ్డు పడుతుంది. కూతురి పేరుతో ఉన్న పాలసీ గడువు తీరిన తర్వాత చేతికి అందుతుంది. అదే సమయంలో అప్పటి వరకు అతనిపై ఆధారపడి ఉన్న భార్యా పిల్లలకు మాత్రం కష్టాలు తప్పవు

వయసుకి తగిన బీమా కవరేజ్ ఉంటే, తనతో పాటు కూతురుకు కూడా మరో పాలసీ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. నిజానికి ఎవరైనా బీమా పాలసీల్లో కట్టే ప్రీమియంలో ఏజంటు కమీషన్లు, కంపెనీ ఖర్చులకి ఎక్కువ మొత్తమే చెల్లించాల్సి ఉంటుందని గుర్తించాలి.

పిపిఎఫ్‌ పథకాలు ఉత్తమం..

  • పిల్లల భవిష్యత్తు కోసం 8 శాతం వడ్డీ వచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ చేస్తే ఎండోమెంట్ పాలసీల్లో గిట్టుబాటయ్యే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీయే గిట్టుబాటవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇందులో కొంత రిస్క్‌కు సిద్ధపడితే నెలనెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో చెల్లిస్తూ పోతే, దీర్ఘకాలానంతరం పిల్లల అవసరాలకు ఉపయోగపడే మంచి ఫండ్ మొత్తాన్ని సిద్ధం చేయొచ్చు.

  • బీమా పాలసీ అనేది దీర్ఘకాలిక కాంట్రాక్టు. ఒక్కసారి పిల్లల పేరుతో పాలసీ తీసుకొని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటిని కట్టలేకపోతే సరెండర్ చార్జీల క్రింద కొంత మొత్తాన్ని కోల్పోవలసి వస్తుంది.పొదుపు పథకాలలో ఈ ఇబ్బంది ఉండదు. డబ్బు అందుబాటులో ఉన్నపుడు చెల్లిస్తే సరిపోతుంది.

ఆస్తులు కొన్న ఇబ్బందులు తప్పవు…

పిల్లల పేరుతో ఇల్లు, స్థలాలు కొనాలని ఆలోచిస్తారు కొందరు. దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు మైనర్ల పేరిట ఉంటే వాటిని అమ్మాలంటే కుదరదు. మైనర్ పిల్లల అవసరం కోసం ఆ ఆస్తుల్ని అమ్మాలంటే దానికి న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలన్నా, ఆ అప్పు మైనర్ అవసరాల కోసమే అని న్యాయస్థానాన్ని అభ్యర్థించిఅనుమతి పొందాల్సి ఉంటుంది.

ఎప్పుడైనా తల్లిదండ్రుల పేరుతో ఆస్తి ఉంటే దుర్వినియోగం అవుతుందన్న భయం ఉంటే తాతయ్యలు, నానమ్మలు మనవళ్ళ పేరుతో స్థిరాస్తులు కొనవచ్చు. కానీ వారికి మైనార్టీ తీరే వరకు యాజమాన్య హక్కులు రావు.

బ్యాంక్ డిపాజిట్లు ఉత్తమం..

బ్యాంక్‌లో మైనర్ పిల్లల పేరుతో ఫిక్సిడ్ డిపాజిట్ చేసి మధ్యలో కాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై లోన్ తీసుకోవాలన్నా ఆ డబ్బు మైనర్ అవసరాల కోసమే అని లిఖ‌ితపూర్వకంగా రాసిస్తే చెల్లుతుంది.

పొదుపైనా,బీమా పాలసీ అయినా పిల్లల కోసం చేయొచ్చు కానీ, పిల్లల పేరుతోనే వాటిని చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు సరియైన బీమా పాలసీ ఉన్న తర్వాత పిల్లల పేరుతో పాలసీ చేయాలి. పిల్లల పేరుతో పాలసీ చేయాలనిపిస్తే తల్లిదండ్రులకి బీమా కవరేజి ఇచ్చే పిల్లల పాలసీలని కొనుగోలు చేయవచ్చు. తల్లిదండ్రులకు ఏమైనా జరిగితే పాలసీ మొత్తాన్ని వెంటనే చెల్లించి, పిల్లలకి మైనార్టీ తీరిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని మళ్ళీ చెల్లించే పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి.