ఇటాలియన్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏప్రిలియా భారత మార్కెట్లో తన స్పోర్టీ స్కూటర్‌ను త్వరలో అప్‌డేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో తయారు చేసిన మోటార్‌సైకిళ్లపై ఎక్కువగా దృష్టి సారించిన ఏప్రిలియా, ఈ నెలాఖరులో కొత్త ఏప్రిలియా ఎస్ఆర్ 175 స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ మోడల్ డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. ఎస్ఆర్ 175 స్కూటర్ ప్రస్తుత ఎస్ఆర్ 160 స్థానంలో రానుంది. ఇది మరింత శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
రాబోయే ఏప్రిలియా ఎస్ఆర్ 175 స్కూటర్.. కొత్త గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్స్ మినహా ఎస్ఆర్ 160కి చాలా పోలి ఉంటుంది. కొత్త కలర్ థీమ్ బ్రాండ్ ఆర్ఎస్ 457, ట్యూనో 457 మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది. వీ- ఆకారపు హెడ్‌ల్యాంప్, షార్ప్‌గా డిజైన్ చేసిన ఫ్రంట్ ఏప్రాన్, సైడ్ ప్యానెల్స్‌పై యాంగులర్ లైన్‌లతో మొత్తం డిజైన్ పెద్దగా మారనట్లు కనిపిస్తుంది. ఈ మోడల్ 14-ఇంచ్ వీల్స్పైనే కొనసాగుతుంది. ఎక్స్‌పోజ్డ్ ఇంజిన్, రేర్ సస్పెన్షన్ దాని స్పోర్టీ రూపాన్ని పెంచుతాయి.
ఏప్రిలియా ఎస్ఆర్ 175 కొత్త 174.7 సీసీ సింగిల్ సిలిండర్, త్రీ-వాల్వ్ మోటారుతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ సుమారు 12.7 బీహెచ్‌పీ పవర్‌ని, 14.14 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. 11.11 బీహెచ్‌పీ పవర్‌ని, 13.44 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందించిన ఎస్ఆర్ 160తో పోలిస్తే ఇది గణనీయమైన అప్‌గ్రేడ్. సస్పెన్షన్, టైర్లు, బ్రేకింగ్ హార్డ్‌వేర్ సహా ఇతర భాగాలు యథావిధిగా కొనసాగుతాయని ఆశించవచ్చు.
ఎస్ఆర్ 457 నుంచి తీసుకున్న కొత్త డిజిటల్ కన్సోల్‌ను చూడవచ్చు. ఇది బ్లూటూత్ ద్వారా నావిగేషన్, జియోఫెన్సింగ్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు వంటి మరిన్ని కనెక్టివిటీ ఎంపికలను అందిస్తుంది.
ఏప్రిలియా ఇంకా ఎస్ఆర్ 175 గురించి అధికారికంగా ప్రకటించలేదు. మోడల్ చిత్రాలు ఆన్‌లైన్‌లో వెలువడుతున్నప్పటికీ, బ్రాండ్ తన సోషల్ మీడియా ఛానెల్‌లలో కూడా నిశ్శబ్దంగా ఉంది.
ఏప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్ ధర రూ. 1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. రాబోయే ఎస్ఆర్ 175 స్వల్పంగా అధిక ధరతో ఉంటుందని భావిస్తున్నారు. కొత్త ఏప్రిలియా ఎస్ఆర్ 175 ప్రధానంగా యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160తో కూడా పోటీ పడనుంది.
సంబంధిత కథనం