Apple share price : ఐఫోన్స్‌పై చైనా తీసుకున్న నిర్ణయంతో అమెరికా స్టాక్ మార్కెట్లో యాపిల్ సంస్థ షేర్ల పతనం కొనసాగుతోంది. సంస్థకు చెందిన మార్కెట్ క్యాపిటల్.. 2 రోజుల్లో ఏకంగా 200 బిలియన్ డాలర్లు పడిపోయింది!
దేశంలోని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఆధారిత కంపెనీల్లోని సభ్యులు.. ఐఫోన్స్‌ని వాడకూడదని.. కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది చైనా. ఈ నిషేధాన్ని ఇతర రంగాలకు కూడా విస్తరించే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు యాపిల్ స్టాక్ 4శాతం పతనమైంది. గురువారం.. 3శాతం నష్టపోయింది. ఫలితంగా 2 రోజుల్లో 200 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూ ఆవిరైపోయిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.
Apple china ban news : అమెరికా నాస్డాక్లో యాపిల్ ఒక హెవీవెయిట్. ఈ స్టాక్ ఇంతలా పడుతుండటంతో.. మొత్తం ఇండెక్స్ మీదే నెగిటివ్ ప్రభావం పడింది. నాస్డాక్ సైతం తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతోంది.
చైనాపై యాపిల్ సంస్థ ఇంతకాలం ఫోకస్ చేస్తూ వచ్చింది. అక్కడ ఒక సామ్రాజ్యాన్నే నిర్మించుకుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చైనాలో ఐఫోన్ సేల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్‌ని కలుపుకుంటే.. ఇక్కడ యాపిల్ రెవెన్యూ 394 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాంటిది.. ఐఫోన్స్ వాడకూడదని చైనా ప్రభుత్వం ఆదేశాలివ్వడం, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో తెలియని సందిగ్ధం నేపథ్యంలో.. యాపిల్ సంస్థ ఆదాయం భారీగా పడిపోవచ్చని మార్కెట్లో భయాలు నెలకొన్నాయి. అందుకే స్టాక్ పతనవుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
China bans Apple iPhones : ఐఫోన్స్ వాడకాన్ని చైనా నిషేధిస్తే.. ఈ ఎఫెక్ట్ ఒక్క యాపిల్ మీదే కాకుండా.. అనేక అమెరికా ఆధారిత టెక్ సంస్థలపైనా పడుతుంది. ముఖ్యంగా చైనాలో సేల్స్, ప్రొడక్షన్‌పై దృష్టిపెట్టిన సంస్థల ఆదాయానికి భారీగా గండిపడొచ్చు. ఈ వార్తతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ సప్లయర్లకు సంబంధించిన స్టాక్స్.. నష్టాల్లోకి జారుకున్నాయి.
కాగా.. ఐఫోన్స్‌పై చైనా నిషేధం వ్యవహారం మీద యాపిల్ సంస్థ ఇంకా స్పందించలేదు.
సంబంధిత కథనం