Ambani's wedding: అనంత్ అంబానీ వివాహం సందర్భంగా గుజరాత్ లో కొత్తగా 14 ఆలయాల నిర్మాణం
Anant Ambani- Radhika Merchant wedding: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు ఆనంత్ అంబానీ వివాహ వేడుక జులై నెలలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుక సందర్భంగా గుజరాత్ లోని జామ్ నగర్లో కొత్తగా 14 ఆలయాలను నిర్మిస్తున్నారు.
Anant Ambani- Radhika Merchant wedding: ఈ ఏడాది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న, ‘వెడ్డింగ్ ఆఫ్ ది ఈయర్’ గా నిలవనున్న అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల వివాహం జులై నెలలో ఘనంగా జరగనుంది. జులై 12న అంగరంగ వైభవంగా జరగనున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
గుజరాత్ లోని జామ్ నగర్ లో..
మార్చి మొదటి వారంలో గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహానికి (Anant Ambani- Radhika Merchant wedding) సంబంధించిన ప్రి - వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, సంపన్న పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు కాగా.. బిజినెస్ టైకూన్ వీరేన్ ఏ మర్చంట్, శైలా వీరేన్ మర్చంట్ ల కుమార్తె రాధికా మర్చంట్. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు ముందు గుజరాత్ లోని జామానగర్ లోని విశాలమైన క్యాంపస్ లో పద్నాలుగు దేవాలయాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఈ పద్నాలుగు దేవాలయాలను జామ్ నగర్ లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీలకు చెందిన ‘నీతా అంబానీ కల్చరల్ సెంటర్’ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన తొలి దృశ్యాలను నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ కు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ షేర్ చేశాయి. ఈ వీడియోలో నీతా అంబానీ ఆ దేవాలయాల నిర్మాణం జరుగుతున్న క్యాంపస్ లో కళాకారులు, స్థానికులతో మాట్లాడుతున్న దృశ్యాలున్నాయి. ఈ దేవాలయాలు భారతదేశపు గొప్ప సంస్కృతి, వారసత్వం మరియు పురాణాలకు సాక్ష్యంగా నిలువనున్నాయని నీతా అంబానీ కల్చరల్ సెంటర్ చెబుతోంది.
14 ఆలయాల వివరాలు..
‘‘ఈ ఆలయంలో సంక్లిష్టంగా చెక్కిన స్తంభాలు, దేవుళ్ళు, దేవతల శిల్పాలు, ఫ్రెస్కో-శైలి పెయింటింగ్స్ ను పొందుపర్చారు. ఈ ఆలయాలను తరతరాల కళాత్మక వారసత్వం నుండి ప్రేరణ పొందిన వాస్తుశైలిలో నిర్మిస్తున్నారు. ఈ ఆలయ సముదాయం భారతదేశ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపునకు కేంద్రంగా ఉండనుంది. నిపుణులైన మాస్టర్ శిల్పులచే జీవం పోసుకున్న ఈ ఆలయ కళ పురాతన పద్ధతులు, సంప్రదాయాలను పాటిస్తుంది’’ అని నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లోని పోస్ట్ లో షేర్ చేశారు.
డిసెంబర్ 22 లోనే నిశ్చితార్థం..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ చిన్ననాటి స్నేహితులు. డిసెంబర్ 2022 లో, ఈ జంట రాజస్థాన్ లోని నాథ్ద్వరాలోని శ్రీనాథ్ జీ ఆలయంలో సాంప్రదాయ రోకా వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2023 జనవరి 19న గోల్ ధన వేడుక జరిగింది.