Ambanis wedding: అంబానీ ఇంట పెళ్లి వేడుకలు షురూ.. పేదలకు సామూహిక వివాహాలు కూడా..
Ambani's wedding: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చంట్ తో జులై 12వ తేదీన జరగనుంది. ముంబైలోని వారి ఇల్లు ‘ఆంటిలియా’లో శనివారం ప్రి వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
Ambani's wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం ముకేశ్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీలు ఆంటిలియాలో అతిథులతో కలిసి ఉన్న వీడియోలు, ఫొటోలు తాజాగా ఆ జాబితాలో చేరాయి.
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో విందు
అంబానీ కుటుంబం తమ నివాసంలో విందు తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను కలిసిన వీడియోను ఫోటోగ్రాఫర్ వరీందర్ చావ్లా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ భగవత్ తో కలిసి కారులో వెళ్లారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ గౌరవ సూచకంగా మోహన్ భగవత్ పాదాలను తాకి నమస్కరించారు. అదే ఫోటోగ్రాఫర్ పోస్ట్ చేసిన మరో వీడియోలో ఇషా అంబానీ భర్త ఆనంద్ పిరమల్ అంటిలియాకు వస్తున్నాడు. ముకేష్ అంబానీ అల్లుడు ఆనంద్ పిరమల్ అంబానీ కుటుంబం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో విందు కోసం అంటిలియాకు చేరుకున్నారు.
సామూహిక వివాహాలు..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా జూలై 2న నిరుపేదల సామూహిక వివాహ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను అంబానీలు ఆహ్వానించారు. పాల్ఘర్ లోని స్వామి వివేకానంద విద్యామందిర్ లో సాయంత్రం 4:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. బిలియనీర్ ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్, షైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్ తో జూలై 12న జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం జరగనుంది.