Amazon job: అమెజాన్ లో పార్ట్ టైమ్ జాబ్ పేరుతో స్కామ్; రూ.1.94 లక్షలు పోగొట్టుకున్న మహిళ
స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త స్కామ్స్ తో ముందుకు వస్తున్నారు. తాజాగా, ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో పార్ట్ టైమ్ జాబ్ పేరుతో కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ స్కామ్ బారిన పడి కర్నాటకకు చెందిన ఒక 25 ఏళ్ల యువతి రూ. 1.94 లక్షలు పోగొట్టుకుంది.
Amazon job Scam: అమెజాన్ వంటి ప్రసిద్ధ సంస్థ నుండి లాభదాయకమైన వేతనం ఆఫర్ చేస్తూ ఆకర్షణీయమైన రిమోట్ జాబ్ ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది?.. ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటారు కదా. కానీ అలాంటి ఆఫర్ వస్తే, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే, అమెజాన్ జాబ్స్ పేరుతో స్కామర్లు కొత్త స్కామ్ కు తెర లేపారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన 25 ఏళ్ల యువతి ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ మోసంలో రూ.1.94 లక్షలు పోగొట్టుకుంది.
అమెజాన్ జాబ్ స్కామ్: ఎలా బయటపడింది
అర్చన అనే మహిళ ఇన్ స్టాగ్రామ్ లో పార్ట్ టైమ్ జాబ్స్ కోసం వెతుకుతుండగా అమెజాన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ యాడ్ కనిపించింది. ఆసక్తితో ఆ యాడ్ పై క్లిక్ చేసి, వారితో వాట్సాప్ చాట్ ప్రారంభించింది. రిక్రూటర్లుగా నటించిన మోసగాళ్లు ఆమెకు ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చారు. అధిక రాబడి కోసం చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టండి. మీకు జాబ్ తో పాటు ఆ పెట్టుబడిపై గణనీయమైన సంపాదన లభిస్తుందని ఆమెకు వారు ఆశచూపారు. వారిపై నమ్మకంతో అక్టోబర్ 18 నుంచి 24 వరకు మొత్తం రూ.1.94 లక్షలను ఆమె గుర్తుతెలియని యూపీఐ ఐడీలకు బదిలీ చేసింది. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, తాను మోసపోయానని అర్చన గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్కామర్స్ వ్యవహార శైలి
ఈ తరహా కుంభకోణం కొత్తేమీ కాదు. మోసగాళ్లు అవాస్తవికంగా అధిక రాబడులు ఇస్తామంటూ బాధితులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, వారు నమ్మకాన్ని పెంపొందించడానికి మొదట్లో చిన్న, చిన్న మొత్తాల్లో డబ్బును చెల్లిస్తుంటారు కూడా. ఆ తరువాత బాధితుడు పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టినప్పుడు.. ఆ డబ్బును కొట్టేస్తారు.
ఈ జాగ్రత్తలు పాటించండి..
- లింక్డ్ఇన్ వంటి వెరిఫైడ్ ప్లాట్ ఫామ్స్ లో మాత్రమే ఉద్యోగాల కోసం సెర్చ్ చేయండి. అధికారిక ఛానెళ్ల ద్వారా నేరుగా రిక్రూటర్లను సంప్రదించండి.
- అవాస్తవ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. అమెజాన్ (amazon) వంటి కంపెనీలు సాధారణంగా ఇన్స్టాగ్రామ్ ప్రకటనల ద్వారా రిక్రూట్ చేసుకోవు. వారి నియామక ప్రక్రియలో సాధారణంగా అనేక కఠినమైన రౌండ్లు, ఇంటర్వ్యూలు ఉంటాయి.
- ఉద్యోగాల (Jobs) కోసం మిమ్మల్ని సంప్రదించే వ్యక్తులు లేదా సంస్థల చట్టబద్ధతను ఎల్లప్పుడూ రెండుసార్లు తనిఖీ చేయండి.
- ధృవీకరించని లింక్ లను క్లిక్ చేయవద్దు: తెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింక్ లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
- అసాధారణ ఆఫర్ లను, పెద్ద మొత్తంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న ఆఫర్ లను నమ్మకండి.