Amazon India Lay offs: ఇండియాలో 1000 మంది ఆమెజాన్ ఉద్యోగులకు ఉద్వాసన
Amazon India Lay offs: ఉద్యోగుల తొలగింపు(Lay offs in Amazon)పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్(Amazon) ఇటీవల కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్(Amazon) పెద్ధ ఎత్తున ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా తప్పని సరై ఈ ఉద్యోగాల తొలగింపు నిర్ణయం తీసుకంటున్నట్లు ఆమెజాన్ ప్రకటించింది. ఆమెజాన్ చేపట్టిన అతి పెద్ద ఉద్యోగాల కోత కార్యక్రమం ఇది.
Amazon India Lay offs: ఇండియాలో వెయ్యి మంది..
ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాల నుంచి మొత్తం 18 వేల ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆమెజాన్(Amazon) ప్రకటించింది. అయితే, ఆ 18 వేలలో భారత్ నుంచి వెయ్యి మంది ఉన్నారని వెల్లడించింది. భారత్ లోని ఆమెజాన్ ఉద్యోగుల్లో 1000 మంది ఉద్యోగులు తమ జాబ్స్ ను కోల్పోనున్నారని తెలిపింది. భారత్ లో ఆమెజాన్ కు మొత్తంగా లక్ష మంది వరకు ఉద్యోగులున్నారు. లక్ష మంది ఉద్యోగుల్లో వెయ్యి మంది, 1% ఎంప్లాయూస్ తమ జాబ్ ను కోల్పోతున్నారు. ఈ విషయమై పూర్తి సమాచారం కోసం ఆమెజాన్ ఇండియా అధికార ప్రతినిధిని సంప్రదించగా, ఆ ఉద్యోగి ప్రతిస్పందించలేదు. కానీ, ఉద్యోగాల తొలగింపుపై ఆమెజాన్ సీఈఓ ((Amazon CEO) ఆండీ జాస్సీ రాసిన బ్లాగ్ లింక్ ను షేర్ చేశారు. ప్రధానంగా ఆమెజాన్ స్టోర్స్ (Amazon Stores), పీఎక్స్ టీ ఆర్గనైజేషన్స్ (PXT organisations) రోల్స్ లో ఉన్న ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆండీ జాస్సీ ఆ బ్లాగ్ లో వెల్లడించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితినే ఉద్యోగాల తొలగింపునకు ప్రధాన కారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా, 2021 డిసెంబర్ 31 నాటికి ఆమెజాన్ (Amazon) లో సుమారు 16 లక్షల మంది ఉద్యోగులున్నారు. వారిలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులున్నారు.