Celkon Wifi Router : జడ్‌టీఈ టెలికాంతో జట్టుకట్టిన సెల్‌కాన్‌, తిరుపతిలో వైఫై రౌటర్ల తయారీ- 1000 మందికి ఉపాధి అవకాశాలు-amaravati celkon zet telecom agreed to make wifi routers at tirupati electronic cluster nara lokesh welcomes ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Celkon Wifi Router : జడ్‌టీఈ టెలికాంతో జట్టుకట్టిన సెల్‌కాన్‌, తిరుపతిలో వైఫై రౌటర్ల తయారీ- 1000 మందికి ఉపాధి అవకాశాలు

Celkon Wifi Router : జడ్‌టీఈ టెలికాంతో జట్టుకట్టిన సెల్‌కాన్‌, తిరుపతిలో వైఫై రౌటర్ల తయారీ- 1000 మందికి ఉపాధి అవకాశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jun 29, 2024 06:47 PM IST

Celkon Wifi Router : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణ దిశగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో సెల్ కాన్ రిసొల్యూట్ జడ్‌టీఈ టెలికంతో జట్టుకట్టింది. తిరుపతిలో వైఫై రౌటర్ల తయారీకి ఈ సంస్థలు చేతులు కలిపారు. దీంతో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

జడ్‌టీఈ టెలికాంతో జట్టుకట్టిన సెల్‌కాన్‌, తిరుపతిలో వైఫై రౌటర్ల తయారీ
జడ్‌టీఈ టెలికాంతో జట్టుకట్టిన సెల్‌కాన్‌, తిరుపతిలో వైఫై రౌటర్ల తయారీ

Celkon Wifi Router : టెలివిజన్స్‌, ల్యాప్‌టాప్స్‌ మొబైల్స్‌, యాక్సెసరీస్‌ తయారీలో ఉన్న సెల్‌కాన్‌ గ్రూప్‌ వైఫై-6 రౌటర్ల విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. సెల్‌కాన్‌ అనుబంధ కంపెనీ సెల్‌కాన్‌ రిసొల్యూట్‌ తాజాగా టెలికమ్యూనికేషన్స్‌ ఎక్విప్‌మెంట్‌ రంగంలో ఉన్న చైనా దగ్గజం జడ్‌టీఈ టెలికంతో చేతులు కలిపింది. ఏపీలోని తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో (ఈఎంసీ-1) ఏర్పాటవుతున్న సెల్‌కాన్‌ రిసొల్యూట్‌ కొత్త ప్లాంటులో ఆగస్ట్‌ నుంచి వైఫై-6 రౌటర్లను ఉత్పత్తి చేయనున్నారు. నెలకు 2 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది చివరినాటికి నెలకు 5 లక్షల యూనిట్ల సామర్థ్యానికి చేరుకోవడంతోపాటు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో జడ్‌టీఈ టెలికం సీఈవో లేవో ఛావ్‌, సెల్‌కాన్‌ గ్రూప్‌ సీఎండీ వై.గురు, రిసొల్యూట్‌ గ్రూప్‌ ఫౌండర్‌, సీఎండీ రమీందర్‌ సోయిన్‌ ఈ వివరాలను వెల్లడించారు. వైఫై-6 రౌటర్ల తయారీలోకి ప్రవేశించడం ద్వారా తొలిదశలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వై.గురు వెల్లడించారు.

రాష్ట్రానికి శుభసూచకం

ఏపీలోకి జడ్‌టీఈ ప్రవేశించడం శుభసూచకమని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. రానున్న రోజుల్లో జడ్‌టీఈ గ్రూప్‌నకు చెందిన ఇతర విభాగాలు సైతం రాష్ట్రంలో తమ ఉత్పత్తులను తయారు చేయాలని ఆయన సూచించారు. ఎలక్ట్రానిక్స్, ఐవోటీ రంగంలో గ్లోబల్ ఛాంపియన్ అయిన జడ్‌టీఈలో భాగమైనందుకు ఆనందంగా ఉందని వై.గురు తెలిపారు. నూతనంగా అభివృద్ధి చెందుతున్న ఇతర సాంకేతిక ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే మొబైల్స్‌, టాబ్లెట్ పీసీలు, టెలివిజన్‌లు, సెట్ టాప్ బాక్సులు, ఇంటెరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల తయారీ చేపడుతున్నామని రమీందర్‌ సోయిన్‌ వివరించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత అయిన వైఫై-6 రౌటర్ల జోడింపు కంపెనీ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడమే కాకుండా సాంకేతిక పురోగతికి కూడా సహాయపడుతుందని అన్నారు.

ఆధునిక సాంకేతికత

అత్యాధునిక వైఫై-6 సాంకేతికతను తీసుకురావడం, వేగం, మరింత విశ్వసనీయ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సెల్‌కాన్ రిసొల్యూట్‌, జడ్‌టీఈ టెలికం ప్రకటించాయి. కంపెనీలను మరింత విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని ఈ సంస్థల ప్రతినిధులు తెలిపారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ టెక్నాలజీ హబ్‌గా మారేందుకు సెల్‌కాన్ రిసొల్యూట్‌, జడ్‌టీఈ టెలికం భాగస్వామ్యం తోడ్పడుతుందన్నారు. ఈ సంస్థ రూపొందించిన హై-ఎండ్ టెక్నాలజీలు సమర్థవంతంగా పట్టణ వాతావరణానికి మార్గం సుగమం చేస్తాయని లేవో ఛావ్‌ తెలిపారు.

స్మార్ట్ సిటీల అభివృద్ధికి

సెల్‌కాన్ రిసొల్యూట్‌, జడ్‌టీఈ టెలికం ఆవిష్కరణలు, స్థిర సాంకేతిక పరిష్కారాల ద్వారా స్మార్ట్ సిటీల అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వైఫై-6 రౌటర్ల పరిచయం నగరాల మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పులు సాధ్యమని ఇరు సంస్థలు తెలిపాయి. "అడ్డంకులు లేని కనెక్టివిటీతోపాటు డేటా నిర్వహణ మరింత మెరుగ్గా ఉంటుంది. స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, సమర్థవంతంగా ఇంధన వినియోగం, మెరుగైన భద్రతా వ్యవస్థలు, మెరుగైన ప్రజా సేవలు వంటి అధునాతన అప్లికేషన్‌లను ప్రారంభించడం ద్వారా నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చడంలో వైఫై-6 రౌటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, మరింత సమర్థవంతమైన నగర నిర్వహణకు దారి తీస్తుంది. సాంకేతిక పురోగతిని పెంపొందించడానికి, స్థిర అభివృద్ధికి తోడ్పడటానికి ఈ భాగస్వామ్యం సాయపడుతుంది. వైఫై-6 సాంకేతికత అమలుతో స్మార్ట్ నగరాల భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది" అని సెల్‌కాన్ రిసొల్యూట్‌, జడ్‌టీఈ టెలికం వివరించాయి.

WhatsApp channel

సంబంధిత కథనం