Airtel 5G network: ఐఫోన్ మినహా అన్ని స్మార్ట్‌ఫోన్లపై ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్
Airtel 5G network: ఐఫోన్ మినహా అన్ని స్మార్ట్‌ఫోన్లపై ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ నవంబరు 15 వరకు అందుబాటులోకి వస్తుందని ఎయిర్‌టెల్ ఎండీ తెలిపారు.
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్లు మినహా అన్ని 5జీ స్మార్ట్‌ఫోన్లపై ఎయిర్ టెల్ 5జీ సేవలు ఈ నవంబరు మధ్య నుంచి అందుబాటులోకి వస్తాయని భారతీ ఎయిర్ టెల్ సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు.
కంపెనీ త్రైమాసిక ఫలితాలపై విశ్లేషణ సందర్భంగా భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గోపాల్ విఠల్ ఈ అంశాన్ని వివరించారు. నవంబరు తొలివారంలో ఆపిల్ తన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రిలీజ్ చేయనుందని, డిసెంబరు 15 నాటికి ఆపిల్ డివైజెస్‌పై కూడా 5జీ సేవలు లభ్యమవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
ఎయిర్‌టెల్ ఇప్పుడు 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తోందని, అయితే 6 నుంచి 9 నెలల్లోగా 5జీ సేవలకు ఛార్జీల విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
‘శాంసంగ్‌లో మొత్తం 27 5జీ మోడల్స్ ఉన్నాయి. 16 మోడల్స్ ఇప్పటికే 5జీ సేవలను సపోర్ట్ చేస్తున్నాయి. మిగిలినవన్నీ నవంబరు 10-12 తేదీల నాటికి సపోర్ట్ చేస్తాయి. వన్‌ప్లస్ నుంచి 17 మోడల్స్ మా నెట్‌వర్క్‌పై పనిచేస్తాయి. వివో నుంచి 34 మోడల్స్, రియల్‌మీ నుంచి 34 మోడల్స్ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ 5జీ సేవలను అందిస్తాయి. షియోమీకి చెందిన 33 మోడల్స్, ఒప్పోకు చెందిన 14 మోడల్స్ కూడా ఎయిర్ టెల్ 5జీ సేవలను సపోర్ట్ చేస్తాయి. ఆపిల్ నుంచి 13 మోడల్స్ ఉన్నాయి. అయితే ఆ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రిలీజ్ చేయాల్సి ఉంది. డిసెంబరు 15 నాటికి సంబంధిత రిలీజ్ వెలువడే అవకాశం ఉంది..’ అని విఠల్ తెలిపారు.
రీసెర్చ్ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం 5.1 కోట్ల 5జీ స్మార్ట్‌ఫోన్లు 2020 నుంచి 2022 మధ్య దిగుమతి అయ్యాయి. అయితే చాలావరకు 5జీ స్మార్ట్‌ఫోన్లు 5జీ సేవలను అందించడం లేదు. ఇందుకు కారణం నెట్‌వర్క్‌కు, మొబైల్ ఫోన్‌కు మధ్య కంపాటిబిలిటీ లేకపోవడమే.
మార్చి 2024 నాటికి దేశంలోని అన్ని పట్టణాలు, ముఖ్యమైన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలు కవర్ అవుతాయని అంచనా వేస్తున్నట్టు విఠల్ తెలిపారు. ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ నిర్మాణ దశలో నిమగ్నమై ఉందని వివరించారు.
నెట్‌వర్క్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రస్తుత 4జీ డేటా ట్రాఫిక్ ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్‌లో తరలడాన్ని మనం చూస్తున్నాం. ఇది క్రమంగా మరింత స్పెక్ట్రమ్ 5జీకి తరలడానికి మాకు అనుమతిస్తుంది. మేం 5జీ నెట్‌వర్క్‌లో స్టాండలోన్ (ఎస్ఏ) మోడ్ పరీక్షించడం కూడా ప్రారంభించాం. ఇది వాణిజ్యపరమైన వినియోగదారులకు సంబంధించిన నెట్‌వర్క్..’ అని వివరించారు.
5జీ సేవల్లో మార్కెట్ వాటా విస్తరించేందుకు ఎయిర్‌టెల్ ఏటా రూ. 23 వేల నుంచి 24 వేల కోట్ల వరకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలని నిర్ణయించింది.
‘పరిశ్రమలో ఒక కంపెనీ ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లకు లోనైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ దేశంలో అత్యంత ప్రీతిపాత్రమైన బ్రాండ్‌గా ఎదిగే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాం. ఈనేపథ్యంలో పోస్ట్‌పెయిడ్ సెగ్మెంట్‌లో మరింత పనితీరు కనబరచాలని చూస్తున్నాం..’ అని విఠల్ వివరించారు.
సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం 89 శాతం పెరిగి రూ. 2,145 కోట్లకు పెరిగింది. ఒక్కో యూజర్‌పై అధిక రెవెన్యూ, డేటా వినియోగంలో పెరుగుదల, 4జీ బేస్ విస్తరణ ఫలాలు ఈ లాభాలకు కారణమయ్యాయి. కాగా ఎయిర్‌టెల్ మొత్తం రెవెన్యూ 22 శాతం పెరిగి రూ. 34,527 కోట్లకు చేరింది.
పటిష్టమైన, నిరంతరమైన పనితీరు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటిందని కంపెనీ తెలిపింది.