Airtel Sim Home Delivery : హైదరాబాద్ లోని తన కస్టమర్లకు 10 నిమిషాల్లో సిమ్ కార్డులను డెలివరీ చేసేందుకు క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్ బ్లింకిట్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. ఇప్పుడు దేశంలోని 16 నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, మరిన్ని నగరాలు, పట్టణాలలో అందుబాటులోకి తీస్తామని ఎయిర్ టెల్ ప్రకటించింది.
రూ.49 కన్వీనియన్స్ ఫీజుతో కస్టమర్లు 10 నిమిషాల్లో సిమ్ కార్డులను వారి ఇంటి వద్దే పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఎయిర్ టెల్, బ్లింకిట్ తెలిపాయి. సిమ్ కార్డు డెలివరీ తర్వాత, కస్టమర్లు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ అథెంటికేషన్ ద్వారా సులభమైన యాక్టివేషన్ ప్రక్రియను ఉపయోగించి నంబర్ యాక్టివేట్ చేయవచ్చు. కస్టమర్లు పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లు ఎంచుకునే అవకాశం లేదా ఎయిర్ టెల్ నెట్ వర్క్ లోకి పోర్ట్ అయ్యేందుకు MNP అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ కోసం కస్టమర్ లు ఆన్ లైన్ లింక్ ని యాక్సెస్ చేసుకోవచ్చు.
యాక్టివేషన్ల కోసం, ఎయిర్ టెల్ కస్టమర్లు తమకు ఏ సహాయం కావాలన్నా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా హెల్ప్ సెంటర్ ను యాక్సెస్ చేయవచ్చు. కొత్త కస్టమర్లు సహాయం అవసరమైతే 9810012345 కాల్ చేయడం ద్వారా సపోర్ట్ ను పొందవచ్చు. సిమ్ కార్డ్ డెలివరీ అయిన తరువాత, సజావుగా, ఇబ్బంది లేని సేవల కోసం కస్టమర్ లు 15 రోజుల సమయంలో సిమ్ ను యాక్టివేట్ చేయడం తప్పనిసరి అని ఎయిర్ టెల్ తెలిపింది.
ఎయిర్ టెల్, బ్లింకిట్..భాగస్వామ్యంపై భారతీ ఎయిర్ టెల్ కనెక్టెడ్ హోమ్స్ సీఈవో, మార్కెటింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ శర్మ మాట్లాడుతూ.. “కస్టమర్ల సులభమైన సేవలు అందించడం ఎయిర్ టెల్ లో ఒక భాగం. 16 నగరాల్లోని వినియోగదారుల ఇళ్లకు 10 నిమిషాల సిమ్ కార్డ్ డెలివరీ కోసం బ్లింకిట్ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ భాగస్వామ్యాన్ని అదనపు నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నాం" అని తెలిపారు.
బ్లింకిట్ ఫౌండర్, సీఈఓ అల్బిందర్ ధిండ్సా మాట్లాడుతూ.. “కస్టమర్ల సమయం ఆదా చేయడానికి, వారికి ఇబ్బంది లేకుండా , ఎంపిక చేసిన నగరాల్లోని వినియోగదారులకు సిమ్ కార్డులను నేరుగా అందించడానికి మేము ఎయిర్ టెల్ తో కలిసి పనిచేస్తున్నాం, కేవలం 10 నిమిషాల్లో సిమ్ డెలివరీ చేస్తాం. బ్లింకిట్ డెలివరీని చూసుకుంటుంది, అయితే ఎయిర్ టెల్ వినియోగదారులకు సెల్ఫ్-కేవైసీని పూర్తి చేయడం, వారి సిమ్ ను యాక్టివేట్ చేయడం, ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిన్ ప్లాన్ల ఎంపిక ప్రాసెస్ చూస్తుంది. కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు నంబర్ పోర్టబిలిటీని కూడా ఎంచుకోవచ్చు..
తొలి దశలో హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై, ఢిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, సోనిపట్, భోపాల్, ఇండోర్, బెంగళూరు, ముంబై, పుణె, లక్నో, జైపూర్, కోల్ కతా వంటి మహానగరాలతో సహా 16 ప్రధాన నగరాల్లో సిమ్ డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.