ఎయిర్‌టెల్ 'ఫ్రాడ్ డిటెక్షన్' టెక్నాలజీ - ఇక ఆన్‌లైన్ మోసాలకు చెక్-airtel launches fraud detection tech to stop online scams ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎయిర్‌టెల్ 'ఫ్రాడ్ డిటెక్షన్' టెక్నాలజీ - ఇక ఆన్‌లైన్ మోసాలకు చెక్

ఎయిర్‌టెల్ 'ఫ్రాడ్ డిటెక్షన్' టెక్నాలజీ - ఇక ఆన్‌లైన్ మోసాలకు చెక్

HT Telugu Desk HT Telugu

స్పామ్, సైబర్ మోసాల బారి నుంచి తన కస్టమర్లను కాపాడటానికి ఎయిర్‌టెల్ ఒక సూపర్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వస్తున్న 'ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్' అని ఎయిర్‌టెల్ చెబుతోంది.

ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ తీసుకొచ్చిన ఎయిర్ టెల్ (HT_PRINT)

ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు చాలా ఎక్కువైపోతున్నాయి కదా? ఇమెయిల్స్ ద్వారా, వాట్సాప్ లాంటి మెసేజ్‌ల ద్వారా తెలియని లింక్‌లు పంపి, మనల్ని మోసం చేయాలనుకునే వెబ్‌సైట్‌లకు పంపించేస్తున్నారు. ఇలాంటి స్పామ్, సైబర్ మోసాల బారి నుంచి తన కస్టమర్లను కాపాడటానికి ఎయిర్‌టెల్ ఒక సూపర్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వస్తున్న 'ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్' అని ఎయిర్‌టెల్ చెబుతోంది.

ఈ కొత్త సెక్యూరిటీ సర్వీస్ ఎలా పనిచేస్తుందంటే... మీరు ఇమెయిల్స్ చూస్తున్నప్పుడు, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి యాప్స్ వాడుతున్నప్పుడు, లేదా ఎస్సెమ్మెస్ ద్వారా ఏదైనా లింక్ వచ్చినప్పుడు... ఇలా మీరు ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసే ఏ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ నుంచైనా వచ్చే లింకులను, వెబ్‌సైట్ అడ్రస్‌లను ఇది చెక్ చేస్తుంది. ఏదైనా వెబ్‌సైట్ హానికరమైనదిగా, మోసపూరితమైనదిగా అనుమానం వస్తే, దాన్ని రియల్ టైంలో అంటే మీరు ఓపెన్ చేయబోయే లోపే ఈ టెక్నాలజీ గుర్తించి, బ్లాక్ చేస్తుంది.

ఈ భద్రతను ఎయిర్‌టెల్ మొబైల్ లేదా బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లందరికీ ఉచితంగా అందిస్తున్నారు. దీని కోసం మీరు ప్రత్యేకంగా ఏమీ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్‌గా మీ సర్వీస్‌తో యాక్టివేట్ అయి పనిచేస్తుంది. ఒకవేళ ఎయిర్‌టెల్ సిస్టమ్ హానికరమైనదిగా గుర్తించిన ఏదైనా వెబ్‌సైట్‌ను మీరు పొరపాటున ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆ పేజీ మీ బ్రౌజర్‌లో లోడ్ అవ్వదు. బదులుగా, ఎందుకు ఆ పేజీని బ్లాక్ చేశారో వివరిస్తూ మీకు ఒక పేజీ కనిపిస్తుంది.

ఎందుకు ఈ టెక్నాలజీ అవసరం?

దేశవ్యాప్తంగా అందరూ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను విరివిగా వాడుతుండటంతో ఆన్‌లైన్ మోసాల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇది వినియోగదారులకు చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తోంది. గత కొన్నాళ్లుగా ఇలాంటి మోసాలు విపరీతంగా పెరిగాయి. కేవలం ఓటీపీ చెప్పమని అడగడం, మోసపూరిత కాల్స్ వరకే కాకుండా, హానికరమైన లింకులు పంపించి బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం తస్కరించే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన రిపోర్ట్‌లు చూస్తే, లక్షలాది మంది ఇలాంటి ఆన్‌లైన్ మోసాలకు బాధితులయ్యారని తెలుస్తోంది.

ఈ పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఎయిర్‌టెల్, తమ కస్టమర్లను మోసాలు, ఫ్రాడ్స్ నుంచి కాపాడటానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత, చాలా అంచెల్లో పనిచేసే స్మార్ట్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. అన్ని కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్‌లో అనుమానాస్పద వెబ్ అడ్రస్‌లను (డొమైన్‌లను) ఫిల్టర్ చేయడం, మీరు వాడే ఏ పరికరంలోనైనా అలాంటి మోసపూరిత లింకులను బ్లాక్ చేయడమే ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ కొత్త టెక్నాలజీ గురించి భారతీ ఎయిర్‌టెల్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ, "గత కొన్నేళ్లుగా, అమాయకులైన కస్టమర్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బును నేరస్థులు తెలివిగా మోసం చేసి కొట్టేస్తున్న ఎన్నో సంఘటనలు చూశాం. మా ఇంజనీర్లు ఈ సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేసి, ఇప్పుడు ఈ ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్‌ను తీసుకొచ్చారు. దీని వల్ల మా కస్టమర్లు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు మోసపోతామనే బెంగ లేకుండా పూర్తిగా ప్రశాంతంగా ఉండగలరని మేము నమ్ముతున్నాం..’ అని వివరించారు.

‘మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను నిరంతరం స్కాన్ చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోసపూరిత వెబ్‌సైట్‌ల డేటాబేస్‌లతో పోల్చి చూస్తుంది. అలాగే, మోసగాళ్లకు సంబంధించిన మా దగ్గర ఉన్న ప్రత్యేక డేటాబేస్‌ను కూడా చెక్ చేస్తుంది. ఇలా రియల్ టైంలోనే అనుమానాస్పద వెబ్‌సైట్‌లను బ్లాక్ చేస్తుంది. గత 6 నెలలుగా మేము దీన్ని టెస్ట్ చేస్తున్నాం, ఇది చాలా కచ్చితంగా పనిచేస్తోంది. మా నెట్‌వర్క్‌లను స్పామ్, స్కామ్‌ల నుంచి పూర్తిగా సురక్షితంగా మార్చే వరకు మేము ఇంకా కష్టపడి పనిచేస్తూనే ఉంటాం," అని ఆయన అన్నారు.

ఎప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతానికి ఈ సర్వీస్ హర్యానా రాష్ట్రంలోని ఎయిర్‌టెల్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లందరికీ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.