Airtel tool: ట్రూ కాలర్ తరహాలో ఎయిర్ టెల్ నుంచి కొత్త ఏఐ టూల్; ఎయిర్ టెల్ కస్టమర్లకు ఆటో యాక్టివేషన్
స్పామ్ కాల్స్, మెసేజెస్ ను గుర్తించి బ్లాక్ చేసే కొత్త టూల్ ను ఎయిర్ టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అన్ని అనుమానిత స్పామ్ కాల్స్, SMS ల విషయంలో రియల్ టైమ్ లో కస్టమర్లను అలర్ట్ చేస్తుంది. స్పామ్ డిటెక్షన్ లో ప్రస్తుతం మార్కెట్ లీడర్ గా ఉన్న ట్రూ కాలర్ కు ఇది గట్టి పోటీదారు కానుంది.
భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధ (artificial intelligence) ఆధారిత స్పామ్ డిటెక్షన్ సేవను బుధవారం ప్రారంభించింది, ఇది గురువారం నుండి తన వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులోకి రానుంది.
ఎయిర్ టెల్ యూజర్లకు ఆటో యాక్టివేట్
స్పామ్ ను గుర్తించి బ్లాక్ చేసే స్వీడన్ కు చెందిన ట్రూకాలర్ స్మార్ట్ ఫోన్ (smartphone) అప్లికేషన్ కు పోటీగా ఈ టూల్ ను ఎయిర్ టెల్ రూపొందించింది. ఈ టూల్ అన్ని అనుమానిత స్పామ్ కాల్స్, ఎస్ ఎంఎస్ లకు రియల్ టైమ్ లో కస్టమర్లను అప్రమత్తం చేస్తుంది. వినియోగదారుడు ఏ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎయిర్ టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీస్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది.
ట్రూ కాలర్ కు పోటీగా..
ట్రూకాలర్ లేదా మరే ఇతర యాప్ ల కంటే తమ టూల్ మెరుగ్గా ఉంటుందని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ టూల్ చాలా ప్రభావవంతంగా స్పామ్ ను ఆపివేస్తుంది. స్పామ్ కాల్ ద్వారా సంభవించే ఏదైనా ఫ్రాడ్ లేదా మోసాన్ని నిరోధిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోపాల్ విట్టల్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘‘ఈ టూల్ ను గత సంవత్సరం కాలంగా పరీక్షిస్తున్నాం. ఇది ప్రతిరోజూ 100 మిలియన్ల స్పామ్ కాల్స్, 3 మిలియన్ స్పామ్ ఎస్ఎంఎస్ లను గుర్తించగలిగింది. 2 మిలియన్ స్పామర్లను బ్లాక్ చేసింది’’ అని వివరించారు.
డ్యూయల్ లేయర్ ప్రొటెక్షన్
డ్యూయల్ లేయర్ ప్రొటెక్షన్ గా డిజైన్ చేసిన ఈ సొల్యూషన్ లో రెండు ఫిల్టర్లు ఉన్నాయి. ఒకటి నెట్ వర్క్ లేయర్ వద్ద, రెండోది ఐటీ సిస్టమ్స్ లేయర్ వద్ద. ప్రతి కాల్, ఎస్ఎంఎస్ ఈ డ్యూయల్ లేయర్డ్ అల్ షీల్డ్ గుండా వెళ్తుంది. ప్రతిరోజూ 1.5 బిలియన్ సందేశాలను, 2.5 బిలియన్ కాల్స్ ను ఇది ప్రాసెస్ చేస్తుంది. ఇది Al శక్తిని ఉపయోగించి రియల్ టైమ్ ప్రాతిపదికన 1 ట్రిలియన్ రికార్డులను ప్రాసెస్ చేయడానికి సమానం.
ఎస్ఎంఎస్ లను కూడా..
ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన హానికరమైన లింక్ ల గురించి కూడా ఈ సాఫ్ట్ వేర్ వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. దీని కోసం, బ్లాక్ లిస్ట్ చేయబడిన యుఆర్ఎల్ లు, ప్రతి ఎస్ఎంఎస్ కేంద్రీకృత డేటాబేస్ రియల్ టైమ్ ప్రాతిపదికన స్కాన్ చేస్తుంది. ఇది అనుమానాస్పద లింక్ లను క్లిక్ చేయకుండా వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది.
38.7 కోట్ల వినియోగదారులకు..
ఎయిర్ టెల్ (airtel) కు ఉన్న 387 మిలియన్ల వినియోగదారులకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని, ఫీచర్ ఫోన్ వినియోగదారులకు కూడా ఈ పరిష్కారాన్ని విస్తరించడానికి కంపెనీ కృషి చేస్తోందని విట్టల్ తెలిపారు. ఉదాహరణకు స్విగ్గీ (Swiggy) లేదా జొమాటో (zomato) నుంచి కాల్ చేసిన వారిని బ్లాక్ చేయకుండా నిరోధించడానికి, బిజినెస్ టు బిజినెస్ డేటాను పంచుకోవాలని ఎయిర్ టెల్ అన్ని టెలికాం ఆపరేటర్లకు లేఖ రాసింది. స్పామర్ల డేటాను టెలికమ్యూనికేషన్స్ విభాగం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో పంచుకునేందుకు ఎయిర్ టెల్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
స్పామ్స్ తో సమస్య
ట్రాయ్, టెలికాం శాఖ స్పామ్ పై ఉక్కుపాదం మోపినప్పటికీ వినియోగదారులు మాత్రం ఈ ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో టెలికాం సంస్థలు పెద్ద సంఖ్యలో కనెక్షన్లను బ్లాక్ చేశాయి. కానీ స్పామ్ ఇప్పుడు వాట్సాప్, ఓటీటీ యాప్స్ ద్వారా కూడా వస్తోంది. ఓటీటీ (OTT) యాప్స్ లో స్పామ్ విషయంలో తాము ఏమీ చేయలేమని, అందుకోసం వారిని ఏదో ఒక నియంత్రణలోకి తీసుకురావాలని విఠల్ పేర్కొన్నారు.