ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతం తగ్గింపు!-air india to cut international widebody flights by 15 percentage till mid july due to these reasons ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతం తగ్గింపు!

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతం తగ్గింపు!

Anand Sai HT Telugu

ఎయిర్ ఇండియా తన వైడ్‌బాడీ అంతర్జాతీయ విమానాలలో 15 శాతం తగ్గింపును ప్రకటించింది. దీనితో పాటు, బోయింగ్ 787, 777 విమానాలపై సమగ్ర దర్యాప్తు ప్రారంభమైంది.

ప్రతీకాత్మక చిత్రం (Air India Twitter)

హ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా పెద్ద నిర్ణయం తీసుకుంది. 15 శాతం అంతర్జాతీయ విమానాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా తన వైడ్‌బాడీ విమానాల అంతర్జాతీయ విమానాలలో, ముఖ్యంగా బోయింగ్ 787, బోయింగ్ 777లను 15 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో మరింత తనిఖీలు చేపటనున్నట్టుగా తెలిపింది.

జూలై వరకు

ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ స్థిరత్వం, సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఎయిర్ ఇండియా తన వైడ్ బాడీ విమానాల అంతర్జాతీయ సర్వీసులను 15 శాతం తగ్గింపును ప్రకటించింది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూరప్, తూర్పు ఆసియాలోని అనేక దేశాల గగనతలంలో రాత్రి కర్ఫ్యూలు, కొనసాగుతున్న భద్రతా తనిఖీల కారణంగా గత 6 రోజుల్లో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాలలో 83 రద్దులు జరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఎయిర్ లైన్స్ అంతర్జాతీయ విమానాలను తగ్గించాలని నిర్ణయించింది. ఇది జూన్ 20, 2025 నుండి అమలులోకి వస్తుంది. జూలై మధ్య వరకు కొనసాగుతుంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) చురుకుగా పనిచేస్తోంది. బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్(DVR)ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక నివేదికలు ప్రమాదానికి కారణమైన కాన్ఫిగరేషన్ లోపం, ఫ్లాప్‌లను తప్పుగా సెట్ చేయడం లేదా తక్కువ థ్రస్ట్ వంటివి సూచిస్తున్నాయి.

భద్రతా తనిఖీలు

ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 మరియు 787-9 విమానాలకు 'మెరుగైన భద్రతా తనిఖీ' చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశించింది. ఎయిర్ ఇండియాకు చెందిన మొత్తం 33 బోయింగ్ 787 విమానాలలో, 26 విమానాల తనిఖీ పూర్తయింది. అవి ఎగరడానికి సురక్షితమైనవిగా ప్రకటించారు. మిగిలిన విమానాలను కూడా తనిఖీ చేస్తున్నారు.

ఊహించని అంతరాయాలను ఎదుర్కోవడానికి రిజర్వ్ విమానాల లభ్యతను పెంచడానికి తమ నిర్ణయం సహాయపడుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. రద్దు చేసిన ఏవైనా విమానాల గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియజేస్తామని పేర్కొంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.