Air India fare lock feature: ఎయిర్ ఇండియా కొత్త ఫీచర్; విమాన చార్జీలను 48 గంటల పాటు లాక్ చేసుకోవచ్చు
Air India fare lock feature: ఇప్పుడు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, ప్రయాణీకుల సౌకర్యాన్ని మరియు ప్రయాణ ప్రణాళికలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి 'ఫేర్ లాక్' అనే కొత్త ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ కస్టమర్‌లు ఎంచుకున్న ఛార్జీని 48 గంటల పాటు రిజర్వ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.
Air India fare lock feature: ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల కోసం మరో సౌలభ్యాన్ని ప్రకటించింది. ప్రయాణికులు తమ ప్రయాణ ఛార్జీని 48 గంటల పాటు రిజర్వ్ చేసుకోవడానికి వీలు కల్పించే 'ఫేర్ లాక్' అనే కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఎంపిక చేసుకున్న ఛార్జీని 48 గంటల పాటు అలాగే ఉంచుకునే వీలును ఈ ‘ఫేర్ లాక్’ (fare lock) కల్పిస్తుంది. అయితే, ఈ సదుపాయాన్ని పొందడానికి ప్రయాణికులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నామమాత్రపు రుసుముతో, ప్రయాణికులు ఇప్పుడు రెండు రోజుల పాటు తమకు కావలసిన ఛార్జీలను లాక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులకు ఉపయోగకరం
‘‘ఇది కస్టమర్‌లు అనూహ్య ఛార్జీల హెచ్చుతగ్గుల నుంచి, వారు ఇష్టపడే విమాన ఎంపికల లభ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. సర్వీస్ బుకింగ్ తేదీ నుండి కనీసం 10 రోజుల దూరంలో ఉన్న విమాన ఎంపికల కోసం ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది’’ అని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ ఫీచర్‌ని ఉపయోగించాలనుకునే కస్టమర్‌లు తాము ప్రయాణించాల్సిన విమాన మార్గాన్ని నిర్ధారించుకోవాలి. ఆ తరువాత, బుకింగ్ ఫ్లోలో ఫేర్ లాక్ (fare lock) ఆప్షన్ ను ఎంచుకుని, రుసుమును చెల్లించాలి. ఈ రుసుము తిరిగి చెల్లించబడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తరువాత 'మేనేజ్ బుకింగ్' ఆప్షన్ ను ఉపయోగించడం ద్వారా ముందుగా ఎంచుకున్న ఛార్జీల వద్ద తమ బుకింగ్‌లను నిర్ధారించుకోవాలి. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోని ఈ సదుపాయం పొందవచ్చు.
ఫేర్ లాక్ రుసుములు ఇవే..
ఫేర్ లాక్ క్రింది రుసుములలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది ప్రయాణ మార్గం, తేదీలను బట్టి మారుతూ ఉంటుంది. ఇండియా నుంచి వెళ్లే విమానాల్లో ఒక్కో టికెట్ పై.. దేశీయ ప్రయాణాలకు రూ. 500, షార్ట్ హాల్ ఇంటర్నేషనల్ ప్రయాణాలకు రూ. 850, సుదూర అంతర్జాతీయ విమానాలకు నాన్ రిఫండబుల్ ఫీగా రూ. 1500 చెల్లించాలి. భారత్ కు వచ్చే విమానాల్లో ఒక్కో టికెట్ పై.. షార్ట్ హాల్ ఇంటర్నేషనల్ ప్రయాణాలకు 10 డాలర్లు, సుదూర అంతర్జాతీయ విమానాలకు రూ. 18 డాలర్లు చెల్లించాలి. ఈ రుసుము నాన్ రిఫండబుల్ అని గమనించాలి.
ఎయిర్ ఇండియాకు నోటీసు
ఇటీవల, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానం 20 గంటల ఆలస్యం తర్వాత ఎయిర్ ఇండియాకు విమానయాన మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఢిల్లీలో వేసవి ఉష్ణోగ్రతల్లో ఎయిర్ కండిషనింగ్ లేకుండా ప్రయాణికులను విమానం లోపల కూర్చోబెట్టడంపై ఈ నోటీసును జారీ చేశారు. ప్రయాణికుల్లో కొందరు వేడికి స్పృహ కోల్పోయారు. మరికొందరు దిగేందుకు అనుమతించాలని వేడుకున్నారు.