Budget 2025 Agriculture : అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు!
Budget 2025 Agriculture : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపుతోపాటుగా మరికొన్ని వరాలు ప్రకటించారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో గురజాడ్ అప్పారావు సూక్తిని ప్రస్తావించారు. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అనే మాటలను గుర్తు చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా.. భారత్ మెరుగైన పనితీరు కనబరించిందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన కేటాయింపులను చదివి వినిపించారు నిర్మలా సీతారామన్. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సహం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన ఉంటుందని తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి కీలక అప్డేట్ ఇచ్చారు కేంద్రమంత్రి. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నట్టుగా ప్రకటించారు. దీని ద్వారా 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. అంతేకాదు కంది, మినుములు, మసూర్‌ల కొనుగోలు కేంద్రమే చేయనున్నట్టుగా తెలిపారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకాన్ని ప్రారంభించారు.
'అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే మన ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత పదేళ్లుగా మన అభివృద్ధి ట్రాక్ రికార్డు, నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ కాలంలోనే భారత్ సామర్థ్యంపై విశ్వాసం పెరిగింది. అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధిని ప్రేరేపించే సబ్ కా వికాస్ సాధనకు వచ్చే 5 సంవత్సరాలను ఒక అపూర్వ అవకాశంగా భావిస్తున్నాం.' అని నిర్మలా సీతారామన్ అన్నారు.
తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కవర్ చేస్తుందని కేంద్రమంత్రి చెప్పారు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని, పంచాయతీ స్థాయిలో నిల్వను పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమం 1.7 కోట్ల మంది రైతులకు వర్తిస్తుందని ప్రకటించారు. రాష్ట్రాలతో కలిసి దీన్ని ప్రారంభించి అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.