మొదటిసారి హోమ్​ లోన్​ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..-a first time homebuyers guide to using a housing loan emi calculator ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మొదటిసారి హోమ్​ లోన్​ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..

మొదటిసారి హోమ్​ లోన్​ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..

Sharath Chitturi HT Telugu

తొలిసారి హోమ్​ లోన్​ తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! హౌసింగ్​ లోన్​కి ఉపయోగపడే కాలిక్యులేటర్​, లోన్​ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్​, అర్హత వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

తొలిసారి హౌసింగ్​ లోన్​ తీసుకుంటున్నారా?

సొంతంగా ఒక కారు, ఒక ఇల్లు.. సగటు మధ్యతరగతి వ్యక్తి కోరుకునేది ఇదే! కానీ ఇవీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు. మరీ ముఖ్యంగా సొంత ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం అంటే మాటలు కాదు. మరి మీరు మీ మొదటి ఇంటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఇది ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం! కాబట్టి దీనికి సరైన ప్రణాళిక చాలా అవసరం. సొంత ఇల్లు ఉండాలనే ఆలోచన ఎగ్జైటింగ్​గా ఉన్నప్పటికీ, ప్రారంభం నుంచే మీ రీ-పేమెంట్​ బాధ్యతలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో.. హౌసింగ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్, అర్హత ప్రమాణాలు, గృహ రుణం ప్రక్రియకు అవసరమైన పత్రాల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హౌసింగ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

హోమ్​ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అనేది ఒక ఉచిత ఆన్‌లైన్ సాధనం. ఇది మీ నెలవారీ తిరిగి చెల్లింపు మొత్తాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఇందులో అసలు లోన్ మొత్తం, వర్తించే గృహ రుణ వడ్డీ రెండూ ఉంటాయి.

దీన్ని ఉపయోగించడం చాలా సులువు. మీరు మూడు వివరాలను నమోదు చేయాలి:

లోన్ మొత్తం – మీరు ఎంత రుణం తీసుకోవాలనుకుంటున్నారు.

వడ్డీ రేటు – రుణదాత విధించే వడ్డీ రేటు.

వ్యవధి – మీరు లోన్‌ను తిరిగి చెల్లించే కాలం.

ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత, కాలిక్యులేటర్ ఈఎంఐ మొత్తాన్ని, అలాగే వ్యవధి చివరి నాటికి చెల్లించాల్సిన మొత్తం వడ్డీని ప్రదర్శిస్తుంది. కొన్ని అధునాతన కాలిక్యులేటర్లు మీ ఈఎంఐల పూర్తి వివరాలను అందించడానికి తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ను కూడా అందించవచ్చు.

ఆన్​లైన్​లో హోమ్​ లోన్​ ఈఎంఐ కాలిక్యులేటర్లు సులభంగా దొరుకుతాయి.

హౌసింగ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఎందుకు ఉపయోగించాలి?

మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు హౌసింగ్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి:

స్పష్టమైన ఈఎంఐ:

మీ నెలవారీ చెల్లింపు ఎంత అనేది తెలుసుకోవడం వల్ల, ఆ లోన్ మీ ప్రస్తుత ఆదాయం, ఖర్చులకు సరిపోతుందో లేదో నిర్ణయించుకోవడానికి సహాయపడుతుంది.

లోన్ ఆప్షన్స్​ని పోల్చడానికి సహాయపడుతుంది:

మీరు వివిధ లోన్ మొత్తాలు, వడ్డీ రేట్లు లేదా కాలవ్యవధులను ప్రయత్నించడం ద్వారా ఏది మీకు అనుకూలమైన ఈఎంఐని ఇస్తుందో చూడవచ్చు.

సరైన లోన్ మొత్తం అంచనాను అందిస్తుంది:

మొత్తం రీ-పేమెంట్​ని ముందుగానే చూడటం ద్వారా, మీరు మరింత వాస్తవిక రుణ నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు భరించగలిగిన దానికంటే ఎక్కువ భారం కాకుండా చూసుకోవచ్చు.

గృహ రుణ అర్హత ప్రమాణాలు..

వయస్సు:

చాలా మంది రుణదాతలు దరఖాస్తుదారులు కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని కోరుకుంటారు. గరిష్ట వయస్సు సాధారణంగా 60-65 సంవత్సరాలకు పరిమితం! దరఖాస్తుదారు జీతం పొందే వ్యక్తి లేదా స్వయం ఉపాధి పొందే వ్యక్తి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఉద్యోగం:

మీరు జీతం పొందే దరఖాస్తుదారు అయితే, హోమ్​ లోన్​ తీసుకునేందుకు మీకు కనీసం 3 సంవత్సరాల వర్క్​ ఎక్స్​పీరియెన్స్​ ఉండాలి. స్వయం ఉపాధి పొందే దరఖాస్తుదారులకు, కనీసం 3 సంవత్సరాల వ్యాపార స్థిరత్వం అవసరం.

క్రెడిట్ స్కోర్:

750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ మంచిది. ఎందుకంటే ఇది బాధ్యతాయుతమైన క్రెడిట్ ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది.

పౌరసత్వం:

భారతీయ నివాసితులు, అలాగే జీతం పొందే ప్రవాస భారతీయులు గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గృహ రుణం కోసం అవసరమైన పత్రాలు..

గృహ రుణం కోసం దరఖాస్తు చేయడానికి, మీరు కొన్ని పత్రాలను సమర్పించాలి. వీటిని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం అనుమతి ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

గుర్తింపు- చిరునామా రుజువు:

  • పాన్ కార్డ్ లేదా ఫారం 60 (తప్పనిసరి)
  • ఆధార్ కార్డ్
  • పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ
  • యుటిలిటీ బిల్లు (విద్యుత్ లేదా నీరు వంటివి)

ఆదాయం రుజువు:

మీరు జీతం పొందే వ్యక్తి అయితే:

  • జీతం స్లిప్‌లు (చివరి 3 నెలలు)
  • జీతం జమ అయిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు
  • ఫారం 16 లేదా ఆదాయపు పన్ను రిటర్న్‌లు

మీరు స్వయం ఉపాధి పొందే వ్యక్తి అయితే:

  • వ్యాపార నమోదు ధృవీకరణ పత్రం
  • ఆదాయపు పన్ను రిటర్న్‌లు (చివరి 3 సంవత్సరాలు)
  • లాభనష్టాల నివేదిక, బ్యాలెన్స్ షీట్

ఆస్తి పత్రాలు:

  • అమ్మకపు ఒప్పందం (సేల్ అగ్రిమెంట్)
  • టైటిల్ డీడ్
  • ఆస్తి పన్ను రసీదులు
  • ఆమోదించిన నిర్మాణ ప్రణాళిక (కొత్త నిర్మాణాలకు)

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం