ఇండియాలో 7 సీటర్ వాహనాలకు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది. ఇక ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి ఒక కొత్త 7 సీటర్ ఎస్యూవీ, మార్కెట్లో చేరనుంది. దాని పేరు ఎంజీ మెజెస్టర్. ఈ ఎస్‌యూవీని తొలిసారిగా 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించగా.. ఇప్పుడు ఈ మోడల్‌కి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఇండియాలో లాంచ్ అవుతున్న ఈ మోడల్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కొన్ని గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న మాక్సస్ డీ 90 ఎస్యూవీ ఆధారంగా ఎంజీ మెజెస్టర్ తయారైంది. దీని ముందు భాగంలో భారీ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. దీనికి గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. స్ల్పిట్-హెడ్ ల్యాంప్ డిజైన్ ఉంది. ఇక్కడ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ పైన పెట్టడం జరిగింది. ప్రధాన హెడ్‌ల్యాంప్ క్లస్టర్ బంపర్‌లో నిలువుగా ఉంటుంది. సైడ్‌లో డైమండ్ కట్ ఫినిష్‌తో 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ విత్ వ్రాప్అరౌండ్ డిజైన్, చుంకీ స్కిడ్ ప్లేట్లు ఇతర ముఖ్యమైన డిజైన్ అంశాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి, ఎంజీ మెజెస్టర్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే ఇందులో గ్లోస్టర్ మాదిరిగానే ఇంజిన్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇది 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో రావొచ్చు. ఇది 158.7 బీహెచ్పీ పవర్, 373.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ కూడా ఉండొచ్చు. ఇది 212.5 బీహెచ్పీ పవర్, 478.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది. గేర్ బాక్స్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటుంది. 4x4 సిస్టమ్ ఉపయోగించి పవర్‌ను వెనుక చక్రాలకు లేదా అన్ని చక్రాలకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
ఇతర జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా వాహనంలో ఊహించినట్లుగానే, మెజెస్టర్‌లో మంచి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఫ్రీ స్టాండింగ్ 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, డ్రైవర్ కోసం కొత్త ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. ఇది మొత్తం సమాచారాన్ని చూపిస్తుంది. కస్టమైజేషన్ మోడ్స్‌ని పొందుతుంది.
వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, ప్రీమియం సౌండ్ సిస్టెమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. క్యాబిన్‌ను ఆల్ బ్లాక్ థీమ్‌లో రూపొందించారు.
ఎంజీ మాజెస్టర్ ఎస్యూవీ ఎంజీ గ్లోస్టర్ కంటే ప్రీమియంగా మార్కెట్లోకి అడుగుపెడుతుందని భావిస్తున్నారు. మెజెస్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ .45 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త 7 సీటర్ కారు.. టయోటా ఫార్చ్యునర్ లెజెండర్, నిస్సాన్ ఎక్స్-ట్రయల్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
సంబంధిత కథనం