ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన 7 విషయాలు-7 important things to remember before filing income tax return checkout list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన 7 విషయాలు

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన 7 విషయాలు

Anand Sai HT Telugu

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 15 వరకు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే పన్ను చెల్లింపుదారులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

ఐటీఆర్ ఫైలింగ్

పన్ను చెల్లింపుదారులు సెప్టెంబర్ 15 నాటికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి సిద్ధం కావాలి. పాత, కొత్త పన్ను విధానాలలో దేనినైనా ఎంచుకుని.. ఫారమ్ 16, 26ఏఎస్ వంటి పత్రాలను చెక్ చేసుకోవాలి. పెట్టుబడులు, హెచ్ఆర్ఏ మినహాయింపు, ఇంటి ఆస్తి ఆదాయంలాంటివన్ని చూసుకోవాలి. ప్రస్తుతం, ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. పాత, కొత్త పద్ధతుల మధ్య ఎంచుకోవచ్చు. ఈ కింది 7 విషయాలను తప్పకుండా చుసుకోవాలి.

పన్ను విధానాన్ని ఎంచుకోవాలి

పన్ను చెల్లింపుదారులు వారి పెట్టుబడి చరిత్ర, ఆదాయ స్థాయి ఆధారంగా పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే.. పనిచేస్తున్న కంపెనీకి ముందుగానే తెలియజేయాలి. కొత్త పన్ను విధానంలో అలాంటి అవసరం లేదు.

ఫారం 16

నెలవారీ జీతం పొందే పన్ను చెల్లింపుదారుడు తమ కంపెనీ నుండి పొందవలసిన పత్రం ఫారం 16. ఇది కంపెనీ తన ఉద్యోగుల తరపున ఎంత టీడీఎస్ చెల్లిస్తుందో చూపిస్తుంది.

26ఏఎస్

పన్ను చెల్లింపుదారులు ఫారం 16లో ఇచ్చిన టీడీఎస్ సమాచారాన్ని ఫారం 26ఏఎస్‌లోని టీడీఎస్ సమాచారంతో తనిఖీ చేయాలి. ఇది పన్ను చెల్లింపుదారుడి వివిధ ఆదాయ వనరుల నుండి టీడీఎస్ లేదా టీసీఎస్‌గా తగ్గించిన ఏదైనా మొత్తం వివరాలను అందించే ప్రకటన.. జీతం, పొదుపులు, ఎఫ్‌డీలపై వడ్డీతో సహా.

ఇంటి ఆస్తి నుండి ఆదాయం

జీతం పొందే పన్ను చెల్లింపుదారుడు ఒకే ఇంటి ఆస్తి నుండి ఆదాయం సంపాదించినట్లయితే ఐటీఆర్-1ని దాఖలు చేయవచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తి నుండి ఆదాయం సంపాదించినట్లయితే ఐటీఆర్-2ని దాఖలు చేయాలి.

హెచ్ఆర్ఏ మినహాయింపు

హెచ్ఆర్ఏ ఆధారంగా గణనీయమైన మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అర్హులు అయితే పాత పన్ను విధానంలో పన్ను రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. మీకు అర్హత లేకపోతే జీతం పొందే పన్ను చెల్లింపుదారుగా కొత్త పన్ను విధానంలో రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు.

పెట్టుబడి, పన్ను ఆదా

కొన్ని పన్ను ఆదా చేసే పెట్టుబడులలో పెట్టుబడి పెట్టడం ఆధారంగా ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. కొన్ని పెట్టుబడులకు ఆ సౌకర్యం ఉండదు. ఏ పెట్టుబడికి పన్ను మినహాయింపు ఉందో చూసుకోవాలి. పన్ను ఆదాతో పాటు సంపద సృష్టి కోసం ఆర్థిక పథకంలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో పీపీఎఫ్, ఎస్ఎస్‌వై, కేవీపీ మొదలైనవి ఉంటాయి.

షేర్లలో పెట్టుబడులు

జీతం పొందే పన్ను చెల్లింపుదారులు షేర్లలో పెట్టుబడి పెడితే ఐటీఆర్-2 ద్వారా వారి ఆదాయపు పన్ను రిటర్న్ ను దాఖలు చేయవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.