ఈ కార్లు 28 నెలల్లో 50 వేలు అమ్ముడయ్యాయి.. ఆ సెగ్మెంట్‌లో ఇదే టాప్-50 thousand of these cars were sold in 28 months this is the top in that segment ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ కార్లు 28 నెలల్లో 50 వేలు అమ్ముడయ్యాయి.. ఆ సెగ్మెంట్‌లో ఇదే టాప్

ఈ కార్లు 28 నెలల్లో 50 వేలు అమ్ముడయ్యాయి.. ఆ సెగ్మెంట్‌లో ఇదే టాప్

Anand Sai HT Telugu
Oct 21, 2024 10:32 PM IST

Volkswagen Virtus Sales : వోక్స్‌వ్యాగన్ వర్చుస్ కార్లు 28 నెలల్లో 50 వేలు అమ్ముడయ్యాయి. సెడాన్ కార్లు అమ్మకాలు తగ్గుతున్న సమయంలో ఈ కారు మైలు రాయిని సాధించింది.

వోక్స్‌వ్యాగన్ వర్చుస్
వోక్స్‌వ్యాగన్ వర్చుస్

ఎస్‌యూవీలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత సెడాన్ అమ్మకాలు క్షీణించాయి. మంచి లుక్, మరిన్ని ఫీచర్ల కారణంగా జనాలు ఎస్‌యూవీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే సెడాన్‌లను ఇష్టపడే కొందరు వినియోగదారులు భారతదేశంలో ఉన్నారు. సెడాన్ సెగ్మెంట్లో అమ్మకాలు పరిమితం అయ్యాయి. మిడ్‌సైజ్ సెడాన్ సెగ్మెంట్‌ను శాసించిన దిగ్గజం హోండా సిటీ పతనమైంది. వోక్స్‌వ్యాగన్ వర్చుస్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఈ జర్మన్ మోడల్ భారత మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించింది.

మార్చి 2022లో జర్మన్ బ్రాండ్ వోక్స్‌వ్యాగన్ వర్చుస్ సెడాన్ భారత మార్కెట్లో విడుదలైంది. వోక్స్‌వ్యాగన్ వెంటోకు వర్చుస్ అప్డేట్ వెర్షన్. ఇది వోక్స్‌వ్యాగన్ టిగన్, స్కోడా స్లావియా, స్కోడా కుషాక్, రాబోయే స్కోడా కైలాక్‌లకు ఆధారమైన MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై తయారుచేశారు.

ఎస్‌యూవీలు మార్కెట్‌లో దూసుకెళ్తున్న సమయంలో వర్చుస్ వచ్చింది. ప్రారంభించిన 28 నెలల తర్వాత భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన సి-సెగ్మెంట్ సెడాన్‌గా నిలిచింది. గత 6 నెలల్లో అత్యధికంగా అమ్ముడైన సి-సెగ్మెంట్ సెడాన్ వర్చుస్.

ఈ కాలంలో వర్చుస్ 9788 యూనిట్ల అమ్మకాలు చేసింది. హోండా సిటీ విక్రయాల సంఖ్య 5607 యూనిట్లుగా ఉంది. వెర్నా (8188 యూనిట్లు), స్లావియా (7327 యూనిట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ కారు మోడల్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా SUVల ప్రబలంగా ఉన్న సమయంలో 50,000 యూనిట్ల విక్రయాల మైలురాయిని కూడా అధిగమించింది.

సెడాన్ సెగ్మెంట్ పట్ల చాలా మంది వినియోగదారులు ఆసక్తిలేనట్టుగా వ్యవహరించినప్పటికీ వర్చుస్‌కు అనుకూలంగా పనిచేసిన కొన్ని అంశాలు ఉన్నాయి. రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలు, రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలను అందిస్తూ వచ్చింది. ఎక్స్టీరియర్ కూడా చాలా మందికి నచ్చింది.

స్పోర్టియర్ సెడాన్ కావాలనుకునే వారి కోసం కంపెనీ వర్చుస్ జిటి లైన్, వర్చుస్ జిటి ప్లస్ స్పోర్ట్‌లను కూడా విడుదల చేసింది. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ రేటింగ్ సాధించిన కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వర్చుస్ కూడా 5 స్టార్‌లను స్కోర్ చేయడంతో అమ్మకాల్లో కలిసి వచ్చింది.

వోక్స్‌వ్యాగన్ వర్చుస్ రెండు విభిన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలలో వస్తుంది. మొదటి 1.0 లీటర్ TSI పెట్రోల్ మోటార్ 113 bhp శక్తిని, 178 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. రెండో 1.5-లీటర్ TSI Evo మోటార్ GT-బ్యాడ్జ్డ్ పెర్ఫార్మెన్స్ లైన్ ట్రిమ్‌కు శక్తినిస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డీఎస్సీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.

ఈ సెడాన్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో 10-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 8-స్పీకర్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్ ఉన్నాయి. కీలకమైన భద్రతా ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఈబీడీతో కూడిన ఏబీఎస్ ఉన్నాయి. కారు ధర రూ.13.56 లక్షల నుంచి రూ.19.41 లక్షల వరకు ఉంది.

Whats_app_banner