Top Stocks : ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే లక్షాధికారులే.. అత్యధిక ధర కలిగిన 5 స్టాక్స్
Top Stocks In India : స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టడం నిజానికి రిస్క్‌తో కూడుకున్న పనే. కానీ కొంతమందికి మాత్రం కలిసి వస్తుంది. కొన్ని స్టాక్స్ చాలా ఎక్కువ ధరతో ఉంటాయి. టాప్ 5 స్టాక్స్ ఏంటో చూద్దాం..
రోజురోజుకూ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు దీర్ఘకాలిక పెట్టుబడులతో మంచి లాభాలు పొందుతారు. మరికొందరు తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తారు. ఎలా పెట్టుబడి పెట్టినా.. మార్కెట్ మీద సరైన అవగాహన ఉండాలి. అప్పుడే పెట్టుబడిదారులు మెరుగైన లాభాలను పొందవచ్చు.
భారత స్టాక్ మార్కెట్‌లో చాలా కంపెనీలు లిస్టయ్యాయి. భారతీయ స్టాక్ మార్కెట్లో లక్ష కంటే ఎక్కువ ధర ఉన్న షేర్లు ఉన్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్లో అత్యంత విలువైన ఐదు స్టాక్స్ ఏవో చూద్దాం.
ఎంఆర్ఎఫ్ లిమిటెడ్
ఎంఆర్ఎఫ్ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఎఫ్ భారతీయ స్టాక్ మార్కెట్లో అత్యంత విలువైన స్టాక్. NSEలో MRF షేర్ ధర రూ.1,38,200 వరకు ఉంది. భారతీయ స్టాక్ మార్కెట్లో 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ఏకైక స్టాక్ ఇది. MRF స్టాక్ గత ఏడాదిలో 29.19 శాతం పెరిగింది. ఐదేళ్లలో ఈ షేరు 156.55 శాతం లాభపడగలిగింది. 1,51,445 MRF స్టాక్ అత్యధిక ధర.
హనీవెల్ ఆటోమేషన్
పూణేకు చెందిన హనీవెల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్ దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటి. NSEలో ఈ షేరు ప్రస్తుత ధర రూ.53,824.20. ఇది రెండో అత్యధిక ధర కలిగిన స్టాక్. గత ఆరు నెలల్లో ఈ షేరు 40.35 శాతం లాభపడగలిగింది. ఒక సంవత్సరంలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 28 శాతం లాభాలను తిరిగి ఇచ్చింది. 59,994 హనీవెల్ ఆటోమేషన్ స్టాక్ అత్యధిక ధరగా ఉంది. జనవరి 1, 1999న షేరు ధర కేవలం రూ.93. కానీ అక్కడి నుంచి షేరు ధర పెరిగింది.
పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ప్రముఖ అమెరికన్ బ్రాండ్ అయిన జాకీ ఇంటర్నేషనల్ ఉత్పత్తులను భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, యుఎఇ వంటి దేశాలకు మార్కెట్ చేయడానికి లైసెన్స్ పొందిన కంపెనీ. NCEలో ఈ షేరు ధర రూ.42,400. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 9.35 శాతం పెరిగింది. 42,922 అత్యధిక షేరు ధర.
3ఎం ఇండియా లిమిటెడ్
షేరు ధర పరంగా 3M ఇండియా లిమిటెడ్ 4వ స్థానంలో ఉంది. 3M ఇండియా వివిధ రంగాలలో పారిశ్రామిక పరికరాల తయారీలో అగ్రగామిగా ఉంది. ఎన్‌ఎస్‌ఈలో షేరు ధర రూ.38,899.80. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ 36.45 శాతం వృద్ధిని సాధించింది. 40,856.50 అత్యధిక షేరు ధర.
బాష్ లిమిటెడ్
బాష్ లిమిటెడ్ అనేది ఆటోమోటివ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ టెక్నాలజీ, కన్స్యూమర్ గూడ్స్, ఎనర్జీ మరియు బిల్డింగ్ టెక్నాలజీ రంగాలలో ఉనికిని కలిగి ఉన్న బహుళజాతి సంస్థ. ప్రస్తుత షేరు ధర రూ.33,810. Bosch Ltd గత ఆరు నెలల్లో 33 శాతం, ఒక సంవత్సరంలో 85.36 శాతం లాభపడింది. 36,678 అత్యధిక షేరు ధర.