Upcoming Electric Cars : మరికొన్ని రోజుల్లో మన ముందుకు రాబోతున్న నాలుగు టాప్ ఎలక్ట్రిక్ మోడల్ కార్లు!
Upcoming Electric Cars : ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో టాప్ కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లతో మార్కెట్‌లోకి వస్తున్నాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో నాలుగు టాప్ ఈవీలు రానున్నాయి.
దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ప్రణాళికలు చేస్తున్నాయి. గతేడాది కూడా దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు భారీగా జరిగాయి. కొత్త సంవత్సరంలో కొత్త కార్లు భారతదేశంలోకి ప్రవేశించబోతున్నాయి. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాప్ ఎలక్ట్రిక్ కార్లు కనిపించనున్నాయి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మారుతి సుజుకి ఇ-విటారా
మారుతి సుజుకి తన కొత్త ఇ-విటారాను ఆటో ఎక్స్‌పో 2025లో ప్రారంభించవచ్చు. 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ వేరియంట్‌లను ఇందులో చూడవచ్చు. ఇ-విటారాలో 49 kWh, 61 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది కాకుండా ఈ వాహనం 61 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇందులో డ్యూయల్ మోటారు అమర్చబడి ఉంటుంది. ఇది 180 బీహెచ్‌పీ శక్తిని, 300ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఎక్కువ వివరాలు వెల్లడి కాలేదు. దీని ధర సుమారు రూ. 18 నుంచి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హ్యుందాయ్ క్రెటా ఈవీ
హ్యుందాయ్ తన మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ క్రెటాను జనవరి 17న భారతదేశంలో విడుదల చేయనుంది. ఇది ఆటో ఎక్స్‌పో సందర్భంగా ప్రదర్శిస్తారు. క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. 51.4kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఒకే ఛార్జ్‌పై 472 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది 42kWhతో మరో బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒకే ఒక్కసారి 390 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. క్రెటా ఈవీ అంచనా ధర రూ. 20 లక్షలు.
టాటా సియెర్రా ఈవీ
టాటా మోటార్స్ తన సియెర్రాను మరోసారి భారతదేశంలో విడుదల చేయబోతోంది. అయితే ఈసారి ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో వస్తుంది. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుందని అంచనా. పూర్తి ఛార్జ్‌పై 550 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి.
టాటా హారియర్ ఈవీ
టాటా మోటార్స్ ఈ నెలలో జరిగే ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ హారియర్ ఈవీని ప్రదర్శించవచ్చు. ఈ వాహనం 60 నుండి 80 kWh బ్యాటరీ ప్యాక్‌తో రావచ్చు. ఇది పూర్తి ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని అంటున్నారు. ఇందులో ఏడబ్ల్యూడీ సెటప్ కూడా ఉంటుంది. ఈ వాహనం టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది.