వింటేజ్ కార్ల ప్రత్యేకమైన ప్రదర్శన.. దిల్లీలో ఈవెంట్.. అరుదైన కార్లు, బైక్‌లు
21 Gun Salute Concours D’Elegance : 21 గన్ సెల్యూట్ కాంకోర్స్ డి'ఎలిగాన్స్ 11వ ఎడిషన్ 2025 ఫిబ్రవరి 21 నుండి 23 వరకు దిల్లీలో జరుగుతుంది. ఇది 125 అరుదైన వింటేజ్, క్లాసిక్ కార్లు, 50 హెరిటేజ్ మోటార్ సైకిళ్లను ప్రదర్శిస్తుంది.

దేశంలోనే అతిపెద్ద వింటేజ్ కార్ల ర్యాలీ, ప్రదర్శన దిల్లీలో జరగనుంది. 21 గన్ సెల్యూట్ కాంకోర్స్ డి'ఎలిగాన్స్ 11వ ఎడిషన్ ఫిబ్రవరి 21 నుండి 23 వరకు దిల్లీ ఎన్‌సీఆర్‌లో జరగనుంది. 125 అరుదైన వింటేజ్ కార్లు, 50 హెరిటేజ్ మోటార్ సైకిళ్లను చూడొచ్చు. వచ్చే వారం ఫిబ్రవరి 21న ఇండియా గేట్ నుండి ప్రారంభమై గురుగ్రామ్‌లోని యాంబియన్స్ గ్రీన్స్‌కు వింటేజ్ కార్లు, మోటార్ సైకిళ్లు చేరుకుంటాయి.
సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ కార్యక్రమంలో అరుదైన కార్లను ప్రదర్శిస్తారు. అలాగే ఆటోమొబైల్ ప్రియుల కోసం భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. కథక్, భరతనాట్యం, కథకళి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా జానపద నృత్యాలు కూడా ప్రదర్శిస్తారు.
ప్రత్యేకమైన కార్లు
1939 డెలాహాయే (ఫిగోని ఎట్ ఫలాస్చి) వంటి ప్రత్యేకమైన కార్లు 21 గన్ సెల్యూట్ కాంకోర్స్ డి'ఎలిగాన్స్ 2025 ఈవెంట్ సందర్భంగా యాంబియెన్స్ గ్రీన్స్‌లో ప్రదర్శిస్తారు. రోల్స్ రాయిస్, బెంట్లీ, కాడిలాక్, ఫోర్డ్, ఆస్టన్ మార్టిన్ వంటి ప్రముఖ బ్రాండ్ల కార్లు కూడా ప్రదర్శనలో ఉంటాయి. ఈ సంవత్సరం మొదటిసారిగా 3 అరుదైన వింటేజ్ కార్లు ప్రదర్శనకు రానున్నాయి. 1932 లాన్సిన్ అస్తురా పినిన్‌ఫరినా, 1936 AC 16/70 స్పోర్ట్స్ కూపే, 1948 బెంట్లీ మార్క్ 6 డ్రాప్‌హెడ్ కూపే వస్తున్నాయి.
వింటేజ్ కార్ల క్యాపిటల్
21 గన్ సెల్యూట్ హెరిటేజ్ అండ్ కల్చరల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చీఫ్ ట్రస్టీ మదన్ మోహన్ మాట్లాడుతూ.. 'భారతదేశాన్ని ప్రపంచ వారసత్వ మోటరింగ్ టూరిజం మ్యాప్‌లో ఉంచడానికి మేం ప్రతి సంవత్సరం కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాం. ఈ సంవత్సరం ఈవెంట్ అరుదైన కార్లతో చారిత్రాత్మకంగా ఉండబోతోంది. చాలా వింటేజ్ కార్లు ఉంటాయి. నిపుణులు, ఆటోమొబైల్ ప్రేమికులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు.' అని మదన్ మోహన్ అన్నారు. దిల్లీ ఇప్పుడు భారతదేశపు వింటేజ్ కార్ల రాజధానిగా అభివృద్ధి చెందుతోందని మదన్ మోహన్ అన్నారు.
21 గన్ సెల్యూట్ కాంకోర్స్ డి'ఎలిగాన్స్ 2025లో అనేక ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయి. యువత వింటేజ్ కార్ల గురించి తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వింటేజ్ కార్లు, అరుదైన వెహికల్స్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ వేలం కూడా ఉంటుంది.