KTM 390 Adventure : యూత్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చే కేటీఎమ్ నుంచి రాబోతున్న మరో కొత్త బైక్..!
KTM 390 Adventure : కొత్త కేటీఎమ్ 390 అడ్వెంచర్ వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 30న బైకును భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టుగా కంపెనీ ప్రకటించింది.
భారత మార్కెట్లో స్పోర్ట్స్ మోటార్ సైకిళ్లను విక్రయించే కేటీఎమ్ తన పోర్ట్ ఫోలియోలో కొత్త మోడల్‌ను తీసుకువస్తుంది. కొత్త 390 అడ్వెంచర్ ఎస్ బైక్‌ను జనవరి 30, 2025న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అధికారికంగా ప్రకటించింది. ఈ సరికొత్త మోడల్‌తో భారత మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని కేటీఎమ్ లక్ష్యంగా పెట్టుకుంది. పెర్ఫార్మెన్స్, అడ్వెంచర్, స్టైల్ కోరుకునే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేశారు. యూత్ ఎక్కువగా ఈ బైక్ ఇష్టపడేలా డిజైన్ చేశారు.
అప్డేట్‌గా వస్తున్న బైక్
కొత్త 390 అడ్వెంచర్ ఎస్, 390 ఎండ్యూరో ఆర్‌తో సహా కేటీఎమ్ 390 లైనప్‌లో భాగం. గోవాలో జరిగిన ఇండియా బైక్ వీక్(ఐబీడబ్ల్యూ)లో ఈ రెండు మోటార్ సైకిళ్లు భారత్‌లో అరంగేట్రం చేశాయి. అక్కడ కేటీఎమ్ ఈ మోడళ్లను పరిచయం చేసింది. పాపులర్ 390 అడ్వెంచర్.. 390 అడ్వెంచర్ ఎస్‌కు మధ్య అనేక మార్పులు ఉంటాయి. అడ్వెంచర్ ఎస్ భారీ అప్డేట్స్‌తో వస్తుందని భావిస్తున్నారు.
అధికారిక లాంచ్‌కు ముందు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేటీఎమ్ డీలర్‌షిప్స్ వద్ద కొత్త 390 అడ్వెంచర్ ఎస్, 390 ఎండ్యూరో ఆర్ కోసం అనధికారిక బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించాయి. కస్టమర్లు ఆసక్తి చూపిస్తుండటంతో ఇప్పటికే తమ యూనిట్లను రిజర్వ్ చేసుకున్నారు. బుకింగ్ మొత్తం డీలర్‌షిప్‌ను బట్టి మారుతుంది.
కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఎస్ ఫీచర్లు
కొత్త కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఎస్‌లో 45 బిహెచ్‌పీ, 40 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే సరికొత్త 399సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. 21 అంగుళాల ఫ్రంట్, 17 అంగుళాల రియర్ వైర్ స్పోక్ వీల్స్, పొడవైన విండ్స్క్రీన్, మెరుగైన విండ్ ప్రొటెక్షన్ కోసం సెమీ ఫేరింగ్, నావిగేషన్, ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే కోసం టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 390 అడ్వెంచర్ ఎస్ నాన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్‌ను కూడా కలిగి ఉంది. ఇది హైవే టూరింగ్, లైట్ ఆఫ్-రోడ్ పరిస్థితులకు అనువైనది.
ఆఫ్-రోడ్ ఔత్సాహికుల కోసం 390 ఎండ్యూరో ఆర్ బాగుంటుంది. ఇది కఠినమైన భూభాగాలలో మంచి పనితీరు చూపిస్తుంది. పూర్తిగా సర్దుబాటు చేయగల సస్పెన్షన్, 21 అంగుళాల ముందు, 18-అంగుళాల వెనుక వైర్-స్పోక్ వీల్స్, చిన్న ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్ ఉన్నాయి.