2022 stock market review:2022లో స్టాక్ మార్కెట్ ను భారీగా ప్రభావితం చేసిన అంశాలు
2022 సంవత్సరం స్టాక్ మార్కెట్లకు రోలర్ కోస్టర్ రైడ్ లాగా సాగింది. అనూహ్య ర్యాలీలు, కరెక్షన్లతో స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లను ఓ సారి ఆనందాశ్చర్యాలలో, మరోసారి కోలుకోలేని షాక్ లలో ముంచెత్తాయి.
2022 సంవత్సరానికి చివరి ట్రేడింగ్ సెషన్ డిసెంబర్ 30, శుక్రవారంతో ముగిసింది. ఒవరాల్ గా ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారతీయ మార్కెట్లు ఒడిదుడుకులను సమర్దవంతంగానే తట్టుకుని, నిలబడ్డాయి. మార్కెట్ కేపిటలైజేషన్ పరంగా ఈ సంవత్సరం భారతీయ ఇన్వెస్టర్లు రూ. 16.36 లక్షల కోట్ల మేర లాభపట్టారు. ఈ సంవత్సరం భారతీయ స్టాక్ మార్కెట్లను అత్యధికంగా ప్రభావితం చేసిన అంశాలు కొన్ని ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపిన అంశాలు..
Omicron wave: ఒమిక్రాన్ వేవ్
సంవత్సరం మొదట్లో కొరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ తో భయపెట్టింది. జనవరి నెలలో కొరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగాయి. ఆ తరువత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అదృష్టవశాత్తూ, ప్రాణనష్టం జరగలేదు. హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం లేకుండానే బాధితులు కోలుకున్నారు. కానీ, ఒమిక్రాన్ వేవ్ మొదట్లో స్టాక్ మార్కెట్ ను భారీగా దెబ్బతీసింది. కానీ, త్వరగానే కోలుకుంది. సంవత్సరం చివర్లో ఒమిక్రాన్ బీఎఫ్ 7 (BF.7.) వేరియంట్ కూడా కొన్ని రోజుల పాటు ఇన్వెస్టర్లను భయపెట్టి, స్టాక్ మార్కెట్ ను దెబ్బతీసింది. ఇప్పటికీ ఈ వేరియంట్ తో భయాలు తొలగిపోలేదు. భారత్ లో ఈ వేరియంట్ మరో వేవ్ కు కారణమవుతుందా? అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.
Russia-Ukraine war: రష్యా ఉక్రెయిన్ యుద్ధం
కరోనా వైరస్ భయాలు క్రమంగా తొలగిపోతున్న సమయంలో, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రూపంలో మరో ఉపద్రవం వచ్చింది. ఈ ఉపద్రవం భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బతీసింది. ఊహించిన దాని కన్నా ఎక్కువ కాలం కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రత్యక్ష, పరోక్ష పర్యవసానాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై కొనసాగుతూనే ఉంది.
Global Inflation: ద్రవ్యోల్బణం
అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్భణ పర్యవసానాలు కూడా స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపాయి. రెండేళ్ల కొరోనా ప్రభావం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, తదనంతర ఆర్థిక మాంద్యం ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచాయి. ఆసియా, యూరోప్, అమెరికాల్లో ఆహార ఉత్పత్తుల ధరలు, ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అమెరికా ద్రవ్యోల్బణం అత్యధికంగా 9 శాతానికి పెరిగింది.
Fed rate hike: ఫెడ్ రేట్ల పెంపు
అంతర్జాతీయంగా పెరిగిన ద్రవ్యల్బణాన్ని కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ సహా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్ లు కీలక వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఈ నిర్ణయం కూడా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
Massive FII selling: ఎఫ్ఐఐ అమ్మకాల వెల్లువ
ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత మార్కెట్లను రిస్కీ గా భావించిన విదేశీ సంస్థాగత పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం ప్రారంభించారు. భారత్ నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని, అమెరికా డాలర్లలో, బంగారంలో ఇన్వెస్ట్ చేశారు. దాంతో, ఇండియన్ స్టాక్ మార్కెట్ దెబ్బ తిన్నది. అయితే, గత నాలుగు నెలల్లో భారత్ లోకి మళ్లీ ఎఫ్ఐఐల ప్రవాహం పెరిగింది.
Resilient domestic flows: దేశీ ఇన్వెస్టర్ల మద్దతు
అంతర్జాతీయంగా ఎన్ని సమస్యలు, ఒడిదుడుకులు ఎదురైనా, దేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కు అండగా నిలవడం విశేషం. దేశీయ వర్గాల నుంచి అనూహ్యంగా భారతీయ ఈక్విటీ మార్కెట్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. కరోనా సమస్య తగ్గిన తరువాత, స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది.