Sensex and Nifty Crash Reasons : ఇన్వెస్టర్లకు 10 లక్షల కోట్లు నష్టం.. స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి 5 కారణాలు
Stock Market Crash Reasons In Telugu : దేశీయ స్టాక్ మార్కెట్‌లో సోమవారం కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ భారీగా పడిపోయింది. దీనికి గల కారణాలు తెలుసుకుందాం..
ఆగస్టు 5 సోమవారం భారత స్టాక్ మార్కెట్ భారీ క్రాష్‌ను చూసిందనే చెప్పాలి. ప్రధాన సూచీలు గణనీయమైన నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ దాదాపు 3 శాతం క్షీణించి 78,580.46 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 50 దాదాపు 2శాతం పడిపోయి 24,277.60 వద్దకు చేరుకుంది. యుఎస్‌లో పెరుగుతున్న మాంద్యం భయాలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ క్షీణతకు దారితీశాయి.
ఉదయం 9:45 గంటల సమయానికే బీఎస్‌ఈ సెన్సెక్స్ 1.90 శాతం క్షీణించి 79,442 వద్ద, నిఫ్టీ 50.. 2 శాతం క్షీణించి 24,232 వద్ద ఉన్నాయి. ఆ కాలంలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పడిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ పతనానికి దారితీసిన 5 కారణాలను చూద్దాం..
అమెరికా మాంద్యం భయాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేశాయి. గత శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం, U.S. నిరుద్యోగిత రేటు జూన్‌లో 4.1 శాతం నుండి జూలైలో 4.3శాతానికి చేరుకుంది. ఇది మూడు సంవత్సరాల గరిష్ట స్థాయి. నిరుద్యోగిత రేటు వరుసగా నాలుగో నెలలో పెరిగింది. మాంద్యం ముప్పు పెరగడంతో US ఫెడరల్ రిజర్వ్ రేట్లు తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబరు, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ రేటు కనీసం ఒక శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా మార్కెట్ అస్థిరతకు కారణం అయ్యాయి. ఇజ్రాయెల్ హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హతమార్చిన తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యను ప్రకటించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఇరాన్-ఇజ్రాయేల్ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతై మార్కెట్లపై ప్రభావం పడింది.
నెలరోజులుగా దేశ మార్కెట్ అధిక విలువలో ఉంది. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్స్‌లో కనిపిస్తుంది. రక్షణ, రైల్వే వంటి అధిక విలువ కలిగిన రంగాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. మార్కెట్‌కు మద్దతునిచ్చే కొనుగోలు డిప్స్ ముప్పులో పడ్డాయని కొంతమంది నిపుణులు చెప్పేమాట. ఈ సమయంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని, కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ స్థిరంగా ఉందో లేదో తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాలు జరగడంతో భారత మార్కెట్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. గత వారం అమెరికా స్టాక్ మార్కెట్లు క్షీణించడంతో ఆసియా మార్కెట్లు సోమవారం తమ విక్రయాలను పొడిగించాయి. ఆసియా-పసిఫిక్ షేర్ల ఇండెక్స్ 0.8శాతం పడిపోయింది. జపాన్ నిక్కీ 6.4 శాతం పడిపోయి ఏడు నెలల కనిష్టానికి చేరింది. జపాన్‌కు చెందిన నిక్కీ 225, టాపిక్స్ ఇండెక్స్‌లు దాదాపు 7శాం, దక్షిణ కొరియా కోస్పి 3.9 శాతం, KOSDAQ 3.5 శాతం పడిపోయాయి. హాంగ్ కాంగ్ యొక్క హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా తక్కువ ప్రారంభాన్ని సూచించాయి.
చమురు ధరలు ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడం మార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.29 శాతం తగ్గి బ్యారెల్ 76.59 డాలర్ల వద్ద ఉన్నాయి. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.42 శాతం తగ్గి బ్యారెల్ 73.21 డాలర్ల వద్ద ఉన్నాయి. అలాగే అమెరికా డాలర్ నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ఇలా పలు కారణాలతో భారత మార్కెట్ల మీద ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు.