New Income Tax Bill: టాక్స్ ఇయర్ సహా కొత్త ఆదాయ పన్ను బిల్లులోని 10 ముఖ్యమైన విషయాలు; మరింత సులభంగా పన్ను వ్యవస్థ
New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత బిల్లును ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీకి నివేదిస్తారు. ఈ బిల్లులోని 10 కీలక అంశాలను ఇక్కడ చూడండి.

New Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను చట్టం త్వరలోనే అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదా బిల్లు సరళంగా, సులభంగా అర్థం చేసుకునేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త చట్టంలో కఠిన పదజాలం లేదని, నిబంధనలను అర్థం చేసుకోవడం సులభంగా ఉందని తెలిపారు. ‘‘ఇందులో కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్. కాబట్టి, పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులు కొత్త విధానం నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది'' అని ముంబైకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ చిరాగ్ చౌహాన్ చెప్పారు.
కొత్త ఐటీ బిల్లులోని కీలక అంశాలు
1. తక్కువ పేజీలు: 2024లో సవరించిన ఆదాయపు పన్ను చట్టం 1961లో 823 పేజీలు ఉండగా, కొత్త ఆదాయపు పన్ను బిల్లులో 622 పేజీలు ఉన్నాయి. కాబట్టి ఇది 201 పేజీలు చిన్నది.
2. విభాగాల సంఖ్య: ఈ బిల్లులో 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 16 షెడ్యూళ్లు ఉన్నాయి. ఎక్కువ విభాగాలు ఉన్నప్పటికీ, తక్కువ వివరణలు, నిబంధనలు ఉన్నాయి.
3. స్టాండింగ్ కమిటీ: ఇది పార్లమెంటులో ప్రవేశ పెట్టిన తర్వాత, దీనిని ఆర్థిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతారు. అనంతరం, ఇది సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సంప్రదింపులను ప్రారంభిస్తుంది.
4. ట్యాక్స్ ఆడిట్: కొత్తగా నిర్ణయించిన ఆదాయపు పన్ను పరిమితి కింద ఒక పరిధి ఉంటుంది. ఇప్పుడు ఈ శ్రేణి మధ్య పన్ను ఆడిట్ వర్తిస్తుంది.
5. పరిమితులు పెంపు: వ్యాపారానికి 44 ఏఏడీ పరిమితిని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు, ప్రొఫెషనల్స్ కు రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచారు.
6. చివరి తేదీలు: ట్యాక్స్ ఆడిట్ ఫైలింగ్ తేదీని సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 31 వరకు, పన్ను ఆదాయ పన్ను ఫైలింగ్ చివరి తేదీని అక్టోబర్ 31 నుండి నవంబర్ 30 వరకు పొడిగించారు.
7. సీఏల ఆడిట్: పన్ను ఆడిట్ పరిధిని సీఎస్, సీఎంఏలకు కూడా విస్తరిస్తారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. కానీ సెక్షన్ 515 (3)(బి) ప్రకారం అకౌంటెంట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ అని అర్థం. దీంతో సీఏ కమ్యూనిటీకి ఊరట లభించింది.
8. పన్ను సంవత్సరం: ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే భావనకు భిన్నంగా, ఇప్పుడు దీనిని సింపుల్ గా ట్యాక్స్ ఇయర్ లేదా పన్ను సంవత్సరం అని పిలుస్తారు. దీనివల్ల సామాన్యులకు పన్ను పరిభాష సులభంగా అర్థమవుతుంది.
9. క్యాపిటల్ గెయిన్: లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ (LTCG), షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG) గత ఏడాది మాదిరిగానే ఉన్నాయి.
10. డిజిటల్ లావాదేవీలు: రూ.10 కోట్ల టర్నోవర్ వరకు ఆడిట్ రిలీఫ్ తో డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం ఉంది.
సంబంధిత కథనం
టాపిక్