Tirumala : వెంకటేశ్వర స్వామి పాదాలచెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా: వైవీ సుబ్బారెడ్డి-yv subba reddy condemns chandrababu comments on tirumala laddu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : వెంకటేశ్వర స్వామి పాదాలచెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా: వైవీ సుబ్బారెడ్డి

Tirumala : వెంకటేశ్వర స్వామి పాదాలచెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా: వైవీ సుబ్బారెడ్డి

Basani Shiva Kumar HT Telugu
Sep 19, 2024 04:38 PM IST

Tirumala : ఏపీలో నిత్యం ఏదో ఒక అంశంపై రాజకీయ దుమారం చేలరేగుతోంది. మొన్నటి దాకా బుడమేరు వరదలపై పరస్పరం విమర్శలు చేసుకున్న టీడీపీ, వైసీపీ.. ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదంపై పడ్డాయి. చంద్రబాబు తిరుమల లడ్డూ గురించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు.

వైవీ సుబ్బారెడ్డి
వైవీ సుబ్బారెడ్డి

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో.. ఆవు నెయ్యికి బదులుగా.. జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె వినియోగించారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు భగ్గుమన్నారు. ముఖ్యంగా టీటీడీతో సంబంధం ఉన్న వైసీపీ నేతలు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఏ నాయకుడు చేయని నీచమైన వ్యాఖ్యల్ని చంద్రబాబు చేశారు. భక్తుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశారు. మేము తిరుమల పవిత్రతను కాపాడాం. నేను వెంకటేశ్వర స్వామి పాదాలచెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆరోపణలపై నా కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. మీ ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. మీరు కూడా ప్రమాణం చేయండి. చంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే.. చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తాం' అని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 'హిందూ వ్యతిరేకులు మాట్లాడాల్సిన మాటలు చంద్రబాబు మాట్లాడారు. శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావించే లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికావు. హిందువుల మనోభావాలను చంద్రబాబు కించపరిచారు. రాజకీయ ప్రయోజనాల కోసమే హిందూయేతరుడైన కరీముల్లా షరీఫ్‌ను విజిలెన్స్‌ అధికారిగా నియమించారు. కరీముల్లాతో చంద్రబాబు ఆయనకు కావాల్సిన రిపోర్ట్ రాయించుకున్నారు. జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేసినవారంతా సర్వం నాశనం అవుతారు. లేదంటే ఆరోపణలు చేసిన వ్యక్తే సర్వనాశనం అవుతారు' అని భూమ కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు సాక్ష్యాత్తు వేంకటేశ్వర స్వామి వారిని వాడుకోవడం అనేది తీవ్ర అభ్యంతరకరం అని వైసీపీ విమర్శించింది. కొన్ని కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి.. కానీ తానే గొప్ప భక్తుడిని అన్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ ఉంటారని ఫైర్ అయ్యింది. వైసీపీ మీద, జగన్ మీద దాడి చేయడం కోసమే స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించారని చెప్పడం అనైతికం, అపచారం, దుర్మార్గం అని మండిపడుతోంది. రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆ దేవుడే శిక్షిస్తాడని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.