యువగళం చాప్టర్-2... మిగిలే ఉంది!
‘లోకేశ్ సమర్థుడైన నాయకుడు కాలేడని పెదవి విరిచిన సొంత పార్టీ నేతలను సైతం తనవైపు తిప్పుకోగలిగారు. లోకేశ్ నాయకత్వ లక్షణాలను బయటపెట్టడానికి, పార్టీ శ్రేణుల్లో తన నాయకత్వంపై నమ్మకం కలిగించానికి ఈ పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చర్ జి.మురళీకృష్ణ విశ్లేషణ
‘లోకేశ్ పార్టీకి ఒక గుదిబండ’, ‘జూనియర్ ఎన్టీఆర్ వస్తేగానీ పార్టీ గాడినపడదు’ ‘చంద్రబాబుకు తగిన వారసుడు కాదు’, ‘యువగళం... గంగాళం’ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు వినిపించిన మాటలూ, విమర్శలూ ఇవి! 200 రోజుల యువగళం చాప్టర్-1 పాదయాత్ర తర్వాత లోకేశ్‌పై ఉన్న ఇలాంటి అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ‘కష్టే ఫలి’ అన్నట్టుగా లోకేశ్ ఈ పాదయాత్ర ద్వారా ఒక నాయకుడిగా అవతరించారు. రాబోయే 20 ఏళ్లు తను ఎలా ఉండబోతున్నారు? పార్టీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? అనే విషయాలపై స్పష్టమైన సంకేతాలు పంపించారు.
ట్రెండింగ్ వార్తలు
ఒక్క కిలోమీటరు దూరానికి సగటున 1300 అడుగులు పడతాయి! లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు 200 రోజుల్లో 2710 కిలోమీటర్లు నడిచారు. అంటే, సుమారు 35 లక్షల అడుగులు పడ్డాయి. వేసిన ప్రతి అడుగు ఒక ఓటుగా మారితే, టీడీపీ విజయం సోపానం నిర్మిస్తున్నట్టే లెక్క! ఇక, రోజూ పాదయాత్రకు ముందు నిర్వహించే ‘సెల్ఫి విత్ లోకేశ్’ కార్యక్రమంలో ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మందికి ఆయన సెల్ఫీలు ఇచ్చారు. వీరంతా ఆయనకు నిజమైన అభిమానులుగా మారితే, లోకేశ్ నడిచిన దారుల్లో ఎన్నో గెలుపు మలుపులు దాచిపెట్టినట్టే!
ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర ఆగస్టు 31 నాటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇన్ని రోజులు అవిశ్రాంతంగా ప్రజల మధ్య ఉండటం, వారితో మాటలు కలపడం మాములు విషయమేం కాదు. ‘లోకేశ్‌కి నడవడం చేతకాదు, పాదయాత్ర నవ్వులపాలు కావడం ఖాయం’ అనుకున్నవాళ్ల అంచనాలు సైతం తలకిందులయ్యాయి! తొలుత రోజుకు పది కిలోమీటర్లు నడవాలని నిర్ణయించినా, ప్రస్తుతం 13.5 కిలోమీటర్లు నడుస్తూ పట్టువదలని విక్రమార్కుడిలా లోకేశ్ వేగంగా ముందుకెళ్తున్నారు. దీంతో లోకేశ్ సమర్థుడైన నాయకుడు కాలేడని పెదవి విరిచిన సొంత పార్టీ నేతలను సైతం తనవైపు తిప్పుకోగలిగారు. లోకేశ్ నాయకత్వ లక్షణాలను బయటపెట్టడానికి, పార్టీ శ్రేణుల్లో తన నాయకత్వంపై నమ్మకం కలిగించానికి ఈ పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది.
యువగళం టర్నింగ్ పాయింట్ అదే
చిత్తూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా... లోకేశ్ అదరకుండా, బెదరకుండా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పాదయాత్ర మొదలుపెట్టిన చిత్తూరు జిల్లాలో లోకేశ్ అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 5 నియోజకవర్గాల్లో పాదయాత్రకు సరైన స్పందన రాలేదు. ఇలాగే కొనసాగితే, పాదయాత్ర చాప చుట్టేయ్యడం ఖాయమనుకుంటున్న తరుణంలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడంతో యువగళానికి ఊతం దొరికినట్టయింది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయం తర్వాత ఉమ్మడి అనంతపురం చేరుకున్న పాదయాత్రకు జనం చీమల దండులా రావడం మొదలయ్యింది. సుప్తచేతనావస్తలో ఉన్న టీడీపీ కార్యకర్తలంతా పాదయాత్రలో బారులు కట్టారు. అదే ఉత్సాహం నేటికీ కనపడుతోంది.
పాదయాత్ర చేసిన నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల్ని ప్రస్తావించడం, స్థానిక ఎమ్మెల్యేల బాగోతాలు బయటపెట్టి, వారిని టార్గెట్ చేయడం ద్వారా లోకేశ్ కార్యకర్తల్లో భయాన్ని తొలగించి, చైతన్యం నింపగలిగారు. స్థానిక సమస్యలపై మాట్లాడుతుంటే, లోకల్ నాయకులే ఆశ్చర్యపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఆయన టీమ్‌ని మెచ్చుకోవాల్సిందే. ప్రజల్లో ఉంటున్న బలమైన నాయకులు ఎవరు? కార్యకర్తలకు అండగా ఉంటున్న నాయకులు ఎవరో గుర్తించడానికి ఈ పాదయాత్ర ఒక అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన ఈ పాదయాత్రలో లోకేశ్ కోటి మంది ప్రజలతో కనెక్ట్ అయినట్టు టీడీపీ ప్రకటించుకున్నా... క్షేత్రస్థాయిలో అంతమందిని ప్రభావితం చేసినట్టుగా ఎలాంటి ప్రకంపనలూ కనిపించడం లేదు. ఇది నిజంగా అతిశయోక్తే! కానీ, ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తూ, చాప్టర్-2 పాదయాత్రను పూర్తి చేస్తే, కోటిమందిని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు!
మైనస్ పాయింట్లు అవే
185 మండలాలు, మున్సిపాలిటీలు, 1675 గ్రామాల్లో ఇప్పటివరకు లోకేశ్ పాదయాత్ర చేశారు. ఇందులో 64 బహిరంగ సభలు,132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ, 10 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వివిధ వర్గాల ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమావేశాల ప్రసంగాల్లో లోకేశ్ మాట తీరులో కొంత వరకు మార్పు వచ్చింది. అయితే ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు మెరుగ్గానే ఉంటున్నప్పటికీ మాటల్లో మాత్రం తడబాట్లతో పాటు గ్రాంథిక పదాలు దొర్లుతూనే ఉన్నాయి. ఎవరో రాసిచ్చింది బట్టిపట్టినట్టు, కృత్రిమంగా మాట్లాడటం, పదాలను స్పష్టంగా పలకకపోవడం ఇంకా మైనస్‌గానే ఉంది. లోకేశ్ నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమాల్లోనూ ఈవెంట్ మేనేజ్ మెంట్ తాలూకు కృత్రిమ పోకడలు స్పష్టంగా కనపడుతున్నాయి. ‘షో టైం కన్సెల్టెన్సీ’ వారు సినిమా సెట్లకు బదులు ఈ కార్యక్రమాలకు సహజత్వాన్ని అద్దగలిగితే, లోకేశ్ ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశాలు పెరుగుతాయి. లోకేశ్ నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమాల్లో స్క్రిప్ట్ ప్రకారం ప్రశ్నలు అడగానికి మనుషులను సెట్ చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. అభిమానంతో ఈ కార్యక్రమాలకు వచ్చిన వాళ్లకు మైక్ దొరకని సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక, పాదయాత్ర రూట్ మ్యాప్‌లో ఎన్టీఆర్ పుట్టిన ‘నిమ్మకూరు’ని చేర్చితే సెంటిమెంట్ పండేది. కానీ, పాదయాత్రలో ఇది కూడా ఒక పొరపాటుగానే మిగిలిపోయింది.
యువగళం పాదయాత్ర కేవలం యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు సీనియర్స్ పెదవి విరుస్తున్నారు. పాదయాత్రను గమనిస్తే యువత కంటే, నడి వయస్కులే ఎక్కువ మంది లోకేశ్ వెంట నడుస్తున్నారు. కాబట్టి, తమను దూరం పెడుతున్నారనే భావన సీనియర్ నాయకులు, కార్యకర్తల్లో పెరగకుండా లోకేశ్ జాగ్రత్తలు తీసుకోవాలి. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలే ఆ పార్టీకి వెన్నెముక. ఇప్పుడు పాదయాత్రకు తరలివస్తున్న వారిలో కూడా సింహభాగం బీసీలదే. గత ఎన్నికల్లో బీసీలే అవతలి గట్టున ఉండి వైఎస్సార్సీపీని గెలిపించారు. కాబట్టి, తిరిగి బీసీలను ఆకట్టుకోవాలంటే, కేవలం మాటలతో సరిపెట్టకుండా, బీసీల కోసం ప్రత్యేక పథకాన్ని స్పష్టమైన ప్రణాళికతో ప్రకటించాలి. కానీ, లోకేశ్ ఆ దిశగా ఒక కార్యాచరణ ప్రకటించకపోవడం, టీడీపీకి నష్టం చేసే అవకాశం ఉంది.
200 రోజుల పాదయాత్రలో లోకేశ్‌కి 3,813 వినతిపత్రాలు అందాయి. ఆయన తీసుకుంటున్న వినతులను ఏం చేస్తున్నారో తమకు తెలియాలని, ప్రతిస్పందన ఉండటం లేదనే విమర్శలున్నాయి. వీటిపై లోకేశ్ టీం మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. పాదయాత్రలో భాగంగా రోజూ వివిధ సామాజికవర్గాల ప్రజలతో మాటమంతీ, భేటీల్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నా... నడిచేటప్పుడు కేవలం నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ, తమ సమస్యలు వినడం లేదనే అభిప్రాయం చాలా చోట్ల వినపడుతోంది. పైగా మహిళలకు, బలహీనల వర్గాలకు కాకుండా స్థానిక నాయకులతో పరిచయాలు ఉన్నవారికే తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇస్తున్నట్టు కూడా గుసగుసలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే ప్లాన్ చేసిన సెలెక్టడ్ ఇంటారక్షన్స్ కన్నా, సహజంగా నిజంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారితో మాట్లాడితేనే క్షేత్రస్థాయి పరిస్థితులు లోతుగా విశ్లేశించడం వీలవుతుందని లోకేశ్ గుర్తించాలి.
యువగళంలో హామీల వర్షం
పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటానన్న లోకేశ్, ఆయ వర్గాలన్నింటికీ ప్రత్యేక హామీలు ఇచ్చారు. యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రానికి పెద్ద ప్రైవేట్ కంపెనీలు తీసుకొస్తామని, స్వయం ఉపాధి కోసం శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ‘అభయ హస్తం’ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, టమోటో రైతులకు గిట్టుబాటు ధర, మామిడి బోర్డు ఏర్పాటు, పెండిరగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, స్థానికంగా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వంలో అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామన్నారు. ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి, మైనారిటీ బాలికల కోసం ప్రత్యేక కళాశాలలు కట్టిస్తామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లోకేశ్ ఇచ్చిన అనేక వినూత్న హామీలు ఈ జాబితాలో ఉన్నాయి. చేనేత, గౌడ, కురుబ, రజకులు, వడ్డెరలు, యాదవులు, బుడగ జంగాలు, షట్ర, ఉప్పర, వక్కలిగలు, వాల్మీకి, మత్స్యకారులు, బ్రాహ్మణులు, వ్యాపారులు... ఇలా ప్రతి వర్గానికి లోకేశ్ ప్రత్యేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ ఆయా వర్గాలను ఆకట్టుకునే హామీలే అయినప్పటికీ... క్షేత్రస్థాయిలో వీటిని తగిన రీతిలో ప్రచారం చేయడంలో టీడీపీ క్యాడర్ విఫలమైంది.
వీరిద్దరి కష్టం సరిపోతుందా?
అధికార పార్టీ వైఫల్యాలన్ని ఎండగట్టానికి చేపట్టిన ‘బాదుడే బాదుడు’ ‘ ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ లాంటి కార్యక్రమాలు టీడీపీకి మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నిత్యం జనసమూహంలో ఉంచడానికి ఇలాంటి కార్యక్రమాలు క్రమం తప్పకుండా ఎందుకు చేయలేకపోతుందో టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. పాదయాత్రకు తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే, కార్యకర్తలు యాక్టివ్‌గా ఉంటారని గుర్తించాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజలను ఆకట్టుకోవడానికి పాదయాత్ర నుంచి వినూత్న నినాదాలు, విభిన్న కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి లోకేశ్ 400 రోజుల పాదయాత్ర చేస్తుంటే, 70 ఏళ్ల చంద్రబాబు ఎండనక, వాననక కష్టపడుతున్నారు. పార్టీ నాయకులు మాత్రం కడుపులో చల్ల కదలకుండా, వీరిద్దరి కష్టంతోనే అధికారంలోకి వచ్చేద్దామని స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు. రానున్న వంద రోజులు ఎవరి నియోజకవర్గాల్లో వారు ప్రజలకు చేరువైతేనే, లోకేశ్, చంద్రబాబుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనేది చేదు నిజం.
200 రోజుల్లో చాప్టర్-1 యువగళం పాదయాత్ర ముగిసింది. ఇంకా 200 రోజుల యువగళం చాప్టర్ -2 మిగిలి ఉంది. చాప్టర్ -2లో పాదయాత్ర ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో కొనసాగుతుంది. జనసేనతో పొత్తు, స్పెషల్ ‘క్యామియో’ ని తలపించే పవన్ కళ్యాన్ ప్రభావం వల్ల ఈ జిల్లాల్లో జరిగే పాదయాత్ర రసవత్తరంగా మారబోతుంది. ఈ నేపథ్యంలో మొదటి భాగంలో జరిగిన తప్పులు సరిదిద్దుకుని, రెండో భాగంలో నడుచుకుంటే 2024లో ‘సైకిల్ బొమ్మ’ బ్లాక్ బస్టర్ అవ్వొచ్చు!
- జి.మురళికృష్ణ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,
Email: peoplespulse.hyd@gmail.com
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యాసకర్తవి మాత్రమే. హెచ్‌టీ తెలుగువి కావు..)