Union Budget 2025 : నిధులు రాబట్టుకోవడంలో నితీష్ సక్సెస్.. చంద్రబాబు ఫెయిల్.. వైసీపీ రియాక్షన్ ఇదే!
Union Budget 2025 : కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్డీయే పక్షాలు స్వాగతిస్తుంటే.. ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తాజా బడ్జెట్‌పై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబును విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చెయ్యే చూపారని.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిహార్ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే.. ఏపీకి ఎలాంటి ప్రాజెక్టులు కేటాయించలేదని వ్యాఖ్యానించారు. పథకాలకు కూడా పెద్దగా నిధులు కేటాయించలేదని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకంగా ఉన్నారన్న మిథున్.. ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులను రాబట్టుకోవడంలో బీహర్ సీఎం నితీష్ సక్సెస్ అయ్యారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు విఫలమయ్యారు..
'రాష్ట్రానికి నిధులు రాబట్టే విషయంలో ఏపీ ముఖ్యమంత్ర చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. బడ్జెట్‌లో బీహార్‌కు బొనాంజాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయ్యి చూపించింది. ఇచ్చింది గుండుసున్నానే. దీనిపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెడికల్ సీట్లను భారీగా పెంచుతామని కేంద్రం చెబుతుండగా.. ఉన్న సీట్లు కూడా తమకు వద్దని, వాటిని రద్దు చేయాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖను రాసే దుస్థితి రాష్ట్రంలో ఉంది' అని మిథున్ రెడ్డి విమర్శించారు.
ఎవరూ సంతోషంగా లేరు..
'టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. సూపర్‌సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోకపోవడం లేదు. ఫలితంగా వృద్ధిరేటు పడిపోయింది. 63 శాత మంది రైతులే ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం ఏం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు మైనస్‌లో ఉన్నాయి. రైతులు, ఎంఎస్ఎంఈ, చిరు వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాలు బాగున్నప్పుడే వృద్ధిరేటు సాధ్యపడుతుంది' అని మిధున్ రెడ్డి వ్యాఖ్యానించారు.
టీడీపీ వెర్షన్..
'2025-26 ఆర్థిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత లభించింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు సహా అనేక కేటాయింపులు చేశారు. ఇప్పటికే గత బడ్జెట్‌లో రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి కేంద్రం బడ్జెట్‌లో నిధులు ఇచ్చింది. ఇవే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‍కి, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బీపీసీఎల్ రిఫైనరీ, రైల్వే జోన్ సహా అనేక ప్రాజెక్టులకు చేయూతనిచ్చింది' అని టీడీపీ పేర్కొంది.