ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. ఈ నెల 8న జమ్ముకశ్మీర్ లో శత్రుమూకలను చెండాడుతూ వీరమరణం పొందారు అగ్నీవీర్ మురళీ నాయక్. అతని కుటుంబానికి వైసీపీ అండగా నిలిచింది. ఈ నెల 13న వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి మురళినాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి.. తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిలను ఓదార్చారు.
దేశ రక్షణలో అమరులైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించింది. మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.
తాజాగా జగన్ ఆదేశాలతో.. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ మురళి నాయక్ నివాసంలో ఆయన తల్లితండ్రులు జ్యోతిబాయ్,శ్రీరామ్ నాయక్‌కు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ పరంగా అండగా ఉంటామని అధినేత హామీ ఇచ్చినట్లు మరోసారి ఉషశ్రీచరణ్ గుర్తు చేశారు. జగన్ ఇచ్చినమాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. ఈ విషయంలోనూ కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఉషశ్రి చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరామర్శ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మురళీనాయక్ చిన్నవాడైనా తన మరణంతో చాలా మందికి, పెద్దలకు స్ఫూర్తి దాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు. దేశం కోసం పోరాడుతూ తన ప్రాణ త్యాగంతో అనేక మంది మిగిలిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రక్షణ ఇచ్చారు. దేశం కోసం తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని వెనక్కు తేలేం. కానీ అతడు చేసిన త్యాగానికి రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారు' అని జగన్ కొనియాడారు.
'దేశం కోసం పోరాడుతూ, ప్రాణాలు కోల్పోతే రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. దాన్ని కొనసాగిస్తూ.. ఈ ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతలు. పార్టీ తరపు నుంచి ఆ కుటుంబానికి అండగా ఉంటాం. వైసీపీ నుంచి రూ.25 లక్షలు ఇస్తాం. ఇంకా పార్టీ నుంచి ఈ కుటుంబానికి అందరం తోడుగా ఉంటాం' అని జగన్ స్పష్టం చేశారు. ఆ మాట ప్రకారం శుక్రవారం చెక్కును అందజేశారు.
సంబంధిత కథనం