YS Jagan : శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్-ysrcp president ys jagan sensational tweet on tirupati stampede alleges cm chandrababu pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan : శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్

YS Jagan : శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్

Bandaru Satyaprasad HT Telugu
Jan 12, 2025 10:27 PM IST

YS Jagan : తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులపై చర్యల విషయంపై ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు.

శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్
శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? క్షమాపణలు చెబితే సరిపోతుందా?-వైఎస్ జగన్ సంచలన ట్వీట్

YS Jagan : టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, 6 గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో కూటమి ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు తన చుట్టూ 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ కుప్పం కార్యక్రమంలో పోలీసులను పెట్టుకోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా, స్థానిక కలెక్టర్‌, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణమన్నారు.

yearly horoscope entry point

సంబంధంలేని వారిపై సస్పెన్షన్‌ వేటు

తొక్కిసలాటపై విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన బాధ్యులను చంద్రబాబు ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. జరిగిన ఘోరమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదనేకదా అర్థం? అవుతుందన్నారు. ఏదో తూతూమంత్రంగా తీసుకున్న చర్యలు అధికారులు, టీటీడీ పాలక మండలిని కాపాడ్డానికే కదా? అని ప్రశ్నించారు. శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. తూతూమంత్రంగా తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా? సంబంధంలేని వారిపై సస్పెన్షన్‌ వేటు వేయడం, అరెస్టుచేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావంలేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్‌ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్‌ను డిస్మిస్‌ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా? అని ఆరోపించారు.

క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా?

"ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు డిప్యూటీ సీఎం క్షమాపణ చెబితే అదే చాలు అన్నట్టుగా చేస్తున్న డిమాండ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం...లేదు… క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కిసలాట జరిగి, 6 గురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా? ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం, న్యాయం ఏమీ లేవా? భక్తుల మరణానికి కారకులైన వారికి ఇవేమీ వర్తించవా? సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి" -వైఎస్ జగన్

బాధ్యులపై చర్యలేవి?

తిరుమలలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదని వైఎస్ జగన్ అన్నారు. చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్‌, ఈవో, అడిషనల్‌ ఈవో సహా స్థానిక కలెక్టర్‌, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీళ్లందరినీ వెంటనే డిస్మిస్‌ చేసి, వీరిపై కేసులు పెట్టి ప్రభుత్వ చిత్తశుద్ధిని, దేవుని పట్ల భక్తిని చాటుకోవాలని హితవు పలికారు. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం