Ysrcp Three Capitals : మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుందా? ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యల్లో ఆంతర్యమేంటి?-ysrcp mlc botsa satyanarayana comments on three capitals tdp alleged u turn on capital issue ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Three Capitals : మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుందా? ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యల్లో ఆంతర్యమేంటి?

Ysrcp Three Capitals : మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుందా? ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యల్లో ఆంతర్యమేంటి?

Ysrcp Three Capitals : 'మూడు రాజధానులపై ఆ రోజు మా విధానం అది. ప్రస్తుతం పార్టీలో చర్చించి చెబుతాం' అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ...మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుందని విమర్శించారు.

మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుందా? ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యల్లో అంతర్యమేంటి?

Ysrcp Three Capitals : 2019-24 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చింది. శాసనరాజధానికి అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అధికారంలో ఉన్న ఐదేళ్లు వైసీపీ మూడు రాజధానుల విషయాన్నే ప్రస్తావించింది. రాజధాని అమరావతిని దెబ్బతీసేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఏళ్లపాటు ధర్నాలు, నిరసనలు, యాత్రలు చేశారు. అయినప్పటికీ అప్పటి వైసీపీ సర్కార్ పట్టువీడలేదు. మూడు రాజధానులపై ముందుకే వెళ్లింది.

జగన్ స్వయంగా ప్రకటన

వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అమరావతి అంశాన్ని పక్కకు పెట్టి విశాఖపై దృష్టిపెట్టింది. ఎన్నికల్లో విజయం సాధిస్తే విశాఖ నుంచి పాలన అంటూ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించారు. ఇక ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా విశాఖలోనే అంటూ ప్రచారం చేశారు. దీంతో పాటు విశాఖ టూరిజం శాఖ ఆధ్వర్యంలో రుషికొండపై భారీ ప్యాలెస్ నిర్మించారు. ఇది సీఎం క్యాంప్ ఆఫీసుగా ప్రచారం జరిగింది. అమరావతికి నిర్మాణానికి లక్షల కోట్లు కావాలని, ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ రాజధానికి అనుకూలమని వైసీపీ అధినేతతో పాటు పార్టీ నేతలంగా ప్రస్తావించారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అన్నీ మారిపోయాయి. వైసీపీ 11 స్థానాలకే పరిమితం అవ్వడంతో మూడు రాజధానుల అంశం కనుమరుగైంది.

యూటర్న్ తీసుకున్నారా?

తాజాగా మూడు రాజధానులపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. మూడు రాజధానులపై ప్రస్తుతం మా వైఖరి ఏమిటో పార్టీలో చర్చించి చెపుతాం అని శాసనమండలిలో బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ ...ఆ రోజుకు మూడు రాజధానులు వైసీపీ విధానం. ఈ సమస్య మళ్లీ ముందుకు వస్తే పార్టీలో చర్చించుకొని చెపుతాం అన్నారు. ఈ వ్యాఖ్యలతో మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల అంశం కూడా ఎన్నికలపై ప్రభావం చూపిందని అంటున్నారు.

అమరావతిని శ్మశానంతో పోలుస్తూ

మంత్రిగా ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ...అమరావతిపై వివాదాస్పత వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇంత భారీ బడ్జెట్‌ను కేటాయించలేదని అప్పట్లో అన్నారు. అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనను ఎంచుకున్నామన్నారు.

అమరావతి శ్మశానంలా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం స్పందిస్తూ...అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు తాను అలా మాట్లాడానని అన్నారు. టీడీపీ హయాంలో అమరావతి అభివృద్ధికి రూ.6000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని, దీంతో అమరావతి వల్లకాడులా మారిందని అన్నానన్నారు.

టీడీపీ కౌంటర్

వైసీపీ పక్ష నేత బొత్స తాజా వ్యాఖ్యలు మూడు రాజధానులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుందన్నారు. వైసీపీ తలాతోకలేని విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కూటమి పార్టీలు ముందుకు వెళ్తున్నాయన్నారు. వైసీపీకి ఒక విధానం లేకపోవడం వల్లే ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం