MLA Kotamreddy Comments: ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆక్రోశం.. మంత్రి సమక్షంలోనే సీరియస్ కామెంట్స్ -ysrcp mla kotamreddy sridhar reddy serious comments on officials over development works ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp Mla Kotamreddy Sridhar Reddy Serious Comments On Officials Over Development Works

MLA Kotamreddy Comments: ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆక్రోశం.. మంత్రి సమక్షంలోనే సీరియస్ కామెంట్స్

Mahendra Maheshwaram HT Telugu
Dec 25, 2022 07:45 AM IST

ysrcp mla kotamreddy sridhar reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కోపం వచ్చింది. పనుల విషయంలో అధికారుల తీరును కడిగిపారేశారు. మంత్రి కాకాణి సమక్షంలోనే సీరియస్ కామెంట్స్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (twitter)

MLA kotamreddy sridhar reddy serious comments: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... అధికార వైసీపీ ఎమ్మెల్యే. నెల్లూరు రూరల్ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు అన్నట్లు ఆయన వ్యవహరశైలి కూడా ఉంటుంది. ఆయన చెప్పాలనుకునే విషయాన్ని కూడా డైరెక్ట్ గా అనేస్తారు. అధికార పార్టీలో సీనియర్ నేతగా పేరున్న శ్రీధర్ రెడ్డి... అధికారులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం అనుమతులు ఇచ్చినా... అధికారులు పనులు ఆపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా జిల్లా మంత్రి కాకాణి సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

నెల్లూరు జిల్లా అభివృద్ధిపై శనివారం అధికారులతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు.. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు.. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు మారారు.. కానీ తన పనులు మాత్రం కావడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. వరదలు వచ్చినా ఎఫ్‌డీఆర్‌ పనులు చేపట్టలేదని వ్యాఖ్యానించారు. ఫలితంగా 150 ఎకరాల పంట కొట్టుకుపోయిందన్నారు.. దీనికి ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నించారు. బారాషాహిద్ దర్గాకు 10 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసినా ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ అనుమతి ఇవ్వలేదన్నారు. బీసీ భవన్ నిర్మాణ పనులు కూడా మిగిలిపోయాయి చెప్పుకొచ్చారు. నిధులు రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారని... అసలు ఈ రావత్ ఎవరండీ అంటూ కామెంట్స్ చేశారు. పొట్టేపాలెం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న కోటంరెడ్డి. దీనిపై అధికారుల్ని అడిగితే సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.

గతంలో కూడా రైల్వే, మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగునీటి కాలువలోకి దిగటం పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కూడా అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా జిల్లా మంత్రి కాకాణి సమక్షంలోనే ప్రభుత్వ అధికారుల పని తీరుపై అక్రోశాన్ని వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటంతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే మంత్రివర్గంలో చోటు కల్పించకపోవటంతో అప్పట్లో శ్రీధర్ రెడ్డి... కన్నీరు పెట్టుకున్న సంగతి కూడా తెలిసిందే.

అయితే ఏపీలోని చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ కొందరు ఎమ్మెల్యేలు సందర్భాన్ని బట్టి మాట్లాడినప్పటికీ.. పెద్దగా బయటపడలేదు. కానీ తాజాగా శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం గట్టిగానే చర్చకు దారి తీసినట్లు అయింది.

IPL_Entry_Point