Vijaya Sai Reddy Retirement : విజయసాయిరెడ్డి రిటైర్మెంట్ నిర్ణయం - వైసీపీలో కల్లోలం..!
Vijaya Sai Reddy quits politics : రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం తీసుకోవటం వెనక ఏం జరిగిందనే చర్చ జోరుగా నడుస్తోంది. మరోవైపు ఆయన రాజీనామా నిర్ణయంపై టీడీపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీలో కీలక నేతగా పేరొందిన విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా ప్రకటించారు. అంతేకాదు… ఏకంగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దశాబ్ధానికి పైగా ప్రాంతీయ పార్టీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన… ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.

వైసీపీలో తీవ్ర దుమారం….!
‘విజయసాయిరెడ్డి’…. వైసీపీలో జగన్ తర్వాత ఆయన్నే అన్నట్లు సాగిపోయేది. పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు అంతా తానై వ్యవహరించేవారు. ఇటు రాష్ట్రంలోనే కాదు… ఢిల్లీ రాజకీయాల్లోనే చక్రం తిప్పే నేతగా పేరొందారు. వైసీపీ ఏర్పాటు నుంచి జగన్ వెంటే నడిచారు. పార్టీ అధినేతకు తోడుగానే కాదు నీడగానూ ఉన్నారు.
వైఎస్ కుటుంబంలోని మూడు తరాలతో విజయసాయిరెడ్డి బంధం కొనసాగుతూ వచ్చింది. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ ఏర్పాటు నుంచి మొన్నటి సాధారణ ఎన్నికల వరకు కూడా వైసీపీలో నంబర్ 2 స్థానంలో తిరుగులేని అధికారాన్ని అనుభవించారు. అలాంటి విజయసాయిరెడ్డి అనూహ్యంగా రాజకీయాల నుంచి నిష్క్రమించటం వైసీపీలో తీవ్ర దుమారం రేపింది.
ఆడిటర్ నుంచి పొలిటీషియన్ గా….
నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డికి ఆడిటర్ గా పేరుంది. చార్టెడ్ అకౌంట్ పూర్తి చేసిన ఆయన… పలు నగరాల్లో ఆఫీసులు కూడా ప్రారంభించారు. ఎన్నో కంపెనీలకు ఆడిటింగ్ చూసేవారు. వైఎస్ కుటుంబానికి చెందిన కంపెనీల వ్యవహారాలను కూడా చక్కబెట్టేవారు.
2009 సెప్టెంబర్ లో వైఎస్ఆర్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత జగన్.. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సమయంలో వైసీపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. పార్టీ ఏర్పాటుతో పాటు కీలక సమయాల్లో విజయసాయిరెడ్డి ముందువరుసలో నిలిచారు. జగన్ కు తోడు నీడగా వ్యవహరించారు.
ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి… వైసీపీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవగా… 2016లో పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచే ఆయన పార్టీలో మరింత కీలకంగా మారారు. హస్తిన స్థాయిలో చక్రం తిప్పగలిగారు. ఢిల్లీ పెద్దలతో లైన్ క్లియర్ చేయగలిరారు. ఈ పరిణామాలు వైసీపీకి కలిసొచ్చాయనే అభిప్రాయాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి.
2019 ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. వైసీపీ అధికారంలోకి రావటంతో విజయసాయిరెడ్డి రోల్ మరింత పెరిగింది. లోకల్ టు స్టేట్ అన్నట్లు అంతా తానై వ్యవహారించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను దగ్గరుండి చూశారు. ఈ క్రమంలో ఆయనపై అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ.. పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గలేదనే చెప్పొచ్చు.
2022లో రెండోసారి కూడా జగన్ విజయసాయిరెడ్డికి రాజ్యసభ అవకాశమిచ్చారు. ఆయన పదవీ కాలం 2028 వరకు ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.
గతేడాది జరిగిన ఏపీ సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. అంతేకాకుండా పార్టీ కూడా అధికారం కోల్పోయింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అధికారం కోల్పోయిన వైసీపీ ప్రస్తుతం అనేక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి వంటి నేతలు జగన్ కు అండగా ఉంటారని అంతా భావించారు. కానీ ఇప్పటికే పలువురు నేతలు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. తాజాగా విజయసాయిరెడ్డి కూడా ఇదే బాటలో అడుగులు వేశారు. భవిష్యత్ రాజకీయాలు ఉండవంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే దశాబ్ధానికిపైగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి నిర్ణయం అత్యంత చర్చనీయాంశంగా మారింది.
భిన్నమైన స్పందనలు:
విజయసాయిరెడ్డి నిర్ణయం వైసీపీలో తీవ్ర దుమారం రేపిందనే చెప్పొచ్చు. ఆ పార్టీ అధినేత జగన్ తో పాటు కీలక నేతలు స్పందించాల్సి ఉండగా… ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. చేయాల్సిన పాపాలన్నీ చేసి ఇప్పుడు రాజీనామా చేస్తే అవన్నీ పోయినట్టేనా అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. , మీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికే రాజీనామా నిర్ణయమా? అని నిలదీశారు. మరికొంత మంది నేతలు స్పందిస్తూ… కేసుల నుంచి తప్పించుకోలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సంబంధిత కథనం