YSRCP Protest : విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఉద్యమం.. పోటీగా టీడీపీ ఫ్లెక్సీలు!
YSRCP Protest : ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఛార్జీల పెంపునకు నిరసనగా.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కౌంటర్‌గా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని నమ్మబలికి.. అధికారంలోకి వచ్చాక రూ.15,485.36 కోట్ల భారాన్ని చంద్రబాబు ప్రజలపై మోపారని.. వైఎస్సార్సీపీ ఆరోపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ ఆందోళనలు చేసింది. పార్టీ చీఫ్ జగన్ పిలుపుతో.. శ్రేణులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పుత్తూరు ఆరేటమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి డీఈఈ కార్యాలయం వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
కాకినాడలో..
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. కాకినాడ జిల్లావ్యాప్తంగా వైసీపీ నేతల పోరుబాట పట్టారు. కాకినాడ విద్యుత్ డీఈఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సిటీ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి డీఈఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోరుబాటలో పాల్గొన్నారు. తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, పిఠాపురంలో వంగా గీతా, పెద్దాపురంలో దవులూరి దొరబాబు, జగ్గంపేటలో తోట నరసింహం ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహించారు.
విశాఖలో..
విద్యుత్ ఛార్జీల బాదుడిపై విశాఖ సౌత్ నియోజకవర్గంలో పోరుబాట నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు కొండా రాజీవ్ గాంధీ, జాన్ వెస్లీ తదితరులు హాజరయ్యారు.
కర్నూలులో..
ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు పోరుబాటపట్టారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసన తెలిపారు. కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను మరచి.. విద్యుత్ ఛార్జీల పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
అనంతపురంలో..
జిల్లాలోని విద్యుత్ కార్యాలయాల వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని బ్రహ్మంగారి ఆలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఫ్లెక్సీల కలకలం..
వైసీపీ విద్యుత్ పోరుబాట నేపథ్యంలో.. దర్శిలో టీడీపీ శ్రేణుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పోలీసులకు, మున్సిపల్ కమిషనర్‌కు వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మునిసిపల్ అధికారులు తొలగించారు. తమకు వ్యతిరేకంగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై.. వైసీపీ నాయకులు ఫైర్ అయ్యారు.