జగన్ టార్గెట్‌గా అక్రమ కేసులు పెడుతున్నారని.. మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారన్న నాని.. ఒక్క రోజైనా అదనంగా జగన్‌ను జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందరపడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసు నడుపుతున్నారని విమర్శించారు. లిక్కర్ కేసులో దొంగ సాక్ష్యాలు సేకరిస్తున్నారన్న పేర్ని.. ఈ కేసుతో జగన్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై.. కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైసీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పని చేస్తోందనన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే.. నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని.. తేల్చిచెప్పారు.
'కూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్ ముగిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. కూటమి పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి కింది ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. కానీ, ఏడాది గడుస్తున్నా వాటిలో ఏదీ అమలు చేయడం లేదు' అని బొత్స విమర్శించారు.
'విచ్చలవిడిగా అంతులేని అవినీతి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగింత.. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. సీజ్ ది షిప్ అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు' అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
'ఏడాది పాలనలోనే రూ.1.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు. ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు? వైసీపీ హయాంలో అప్పులు చేసినా.. వివిధ పథకాల కింద రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి. సంపద సృష్టిస్తాను.. అది తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇన్ని అప్పులు, ఇంత తక్కువ సమయంలో ఎందుకు చేశారు? అప్పు చేయడం. ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు' అని బొత్స విమర్శలు గుప్పించారు.
సంబంధిత కథనం