TDP vs YCP : లిక్కర్ పాలసీలపై విచారణకు సిద్దమా.. చంద్రబాబు ఆదాయపన్ను నోటీసులపై మాట్లాడండి : పేర్ని నాని-ysrcp leader perni nani counters tdp mp lavu srikrishna devarayalu comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Vs Ycp : లిక్కర్ పాలసీలపై విచారణకు సిద్దమా.. చంద్రబాబు ఆదాయపన్ను నోటీసులపై మాట్లాడండి : పేర్ని నాని

TDP vs YCP : లిక్కర్ పాలసీలపై విచారణకు సిద్దమా.. చంద్రబాబు ఆదాయపన్ను నోటీసులపై మాట్లాడండి : పేర్ని నాని

TDP vs YCP : టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఏపీలో బాహుబలి కలెక్షన్లకు మించి లిక్కర్ స్కామ్ జరిగిందని.. టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ వేదికగా ఆరోపించారు. ఆయన కామెంట్స్‌పై పేర్ని నాని ఫైర్ అయ్యారు. లిక్కర్ పాలసీలపై విచారణకు సిద్దమా అని ఛాలెంజ్ చేశారు.

మీడియాతో మాట్లాడుతున్న పేర్ని నాని

రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే లేని లిక్కర్‌ స్కామ్‌ను తెరమీదకు తెచ్చారని.. వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు డైరెక్షన్‌లో..

'చంద్రబాబు డైరెక్షన్‌లో లోక్‌సభలో శ్రీకృష్ణదేవరాయలు పచ్చి అబద్దాలను అందంగా వల్లించాడు. నిన్నటి వరకు వైసీపీలో ఎంపీగా ఉన్న ఆయనకు.. రాష్ట్రంలో లిక్కర్‌ పాలసీలో ఒకవేళ అవినీతి జరుగుతుంటే ఆ విషయం తెలియలేదా. ఈ రోజు టీడీపీలో చేరి పార్లమెంటరీ నేతగా మారిన తరువాతే.. లిక్కర్‌స్కామ్ గురించి తెలిసిందా. లేని ఈ స్కామ్‌లో వేలకోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్లిపోయారంటూ తప్పుడు ఆరోపణలు చేశారు' అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మెప్పు కోసం..

'టీడీపీ గూటిలో చేరిన ఫ్లెమింగో పక్షిలాంటి శ్రీకృష్ణదేవరాయులు.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే లోక్‌సభలో మాట్లాడారు. చంద్రబాబు మెప్పుకోసం ఈ రకంగా విషం చిమ్మే కార్యక్రమం చేపట్టారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి నిరాధార నిందలు మోపుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగంగానే లోక్‌సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని.. రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడు నోరు మెదపలేదు' అని నాని విమర్శించారు.

విచారణకు సిద్ధం..

'2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ పాలసీ, గత వైసీపీ ప్రభుత్వంలోని లిక్కర్‌ పాలసీ, తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ పదినెలల్లో లిక్కర్ కార్యకలాపాలపై విచారణకు సిద్దం. తెలుగుదేశం హయాంలోనూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ డిస్టలరీలకు ఎక్కువ మొత్తాలను పెంచి చెల్లిస్తున్నారు. ఈ పెంచిన మొత్తాలను తిరిగి మామూళ్లుగా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెడుతున్నాయి' అని పేర్ని నాని ఆరోపించారు.

కూటమి నేతల చేతుల్లోనే..

'రాష్ట్రంలో మద్యం దుకాణాలు మొత్తం కూటమి నేతల గుప్పిట్లోనే ఉన్నాయి. వేలంలో దక్కించుకున్న మద్యం దుకాణాలను కూడా బెదిరించి, భయపెట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేలు గుంజుకున్నారు. చివరికి గీత కార్మిక సొసైటీలకు ఇచ్చిన దుకాణాలను కూడా లాక్కున్న దుర్మార్గపు పాలన ఈ రాష్ట్రంలో నడుస్తోంది. కిందిస్థాయిలోని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి వరకు మద్యం ముడుపులు అందుకుంటూనే ఉన్నారనేది వాస్తవం. ఇవన్నీ టీడీపీ పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలకు తెలియవా' అని నాని ప్రశ్నించారు.

ఈడీ నోటీసుల సంగతేంటి..

'2014-19లో రాజధాని నిర్మాణానికి వచ్చిన కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్న చంద్రబాబు అవినీతిపైనా, ఆయనకు ఆదాయపన్నుశాఖ ఇచ్చిన నోటీసులపైన శ్రీకృష్ణదేవరాయలు స్పందించాలి. ఈ ఆదాయపన్ను నోటీసుల తదుపరి చర్యలను అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు. 2014-19 మధ్య రాజధాని నిర్మాణం కోసం పనిచేసిన నాలుగైదు కంపెనీల అనామత్తు ఖాతాల నుంచి చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ద్వారా దాదాపు రూ.2000 కోట్లు మీ ఖాతాలకు జమ అయ్యిందని ఈడీ గుర్తించింది. దానిపైన విచారణ ఎందుకు నిలిచిపోయిందో ప్రశ్నించాలి' అని పేర్ని నాని సూచించారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం