YSRCP in EC radar : ఈసీ రాడార్ లో వైఎస్సార్సీపీ.. ఆ నిర్ణయాలే కారణమా ?-ysrcp in eci radar as ec is scrutinising the party constitution to put it on their record
Telugu News  /  Andhra Pradesh  /  Ysrcp In Eci Radar As Ec Is Scrutinising The Party Constitution To Put It On Their Record
వైఎస్సార్సీపీ రాజ్యాంగాన్ని పరిశీలిస్తోన్న ఈసీ
వైఎస్సార్సీపీ రాజ్యాంగాన్ని పరిశీలిస్తోన్న ఈసీ

YSRCP in EC radar : ఈసీ రాడార్ లో వైఎస్సార్సీపీ.. ఆ నిర్ణయాలే కారణమా ?

24 February 2023, 17:53 ISTHT Telugu Desk
24 February 2023, 17:53 IST

YSRCP in EC radar : ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్సీపీపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీ పేరు మార్పు, అధ్యక్షుడి ఎన్నిక అంశంలో చేసిన సవరణలపై పరిశీలన జరుపుతున్నట్లుగా సమాచారం. సవరణలు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా లేకపోతే.. వైఎస్సార్సీపీపై చర్యలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

YSRCP in EC radar : రాజకీయ పార్టీలకు ప్రత్యేక విధి, విధానాలు ఉంటాయి. ఇవి ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా ఉంటాయి. దానినే పార్టీ రాజ్యాంగం అంటారు. జాతీయ, ప్రాంతీయ అనే తేడా లేకుండా ప్రతి పొలిటికల్ పార్టీ.. ఎన్నికల సంఘానికి తమ రాజ్యాంగాన్ని అందించాల్సి ఉంటుంది. అందులోని నియమావళి.. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి లోబడి ఉంటేనే.. ఎన్నికల సంఘం పార్టీలకి గుర్తింపు ఇస్తుంది. అనుమతి పొందిన తర్వాత పార్టీ రాజ్యాంగంలో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తే... వాటిని ఈసీకి తప్పక తెలపాల్సి ఉంటుంది. ఆ మార్పులు కూడా నియమాలు, నిబంధనలకు లోబడి ఉంటేనే ఎన్నికల సంఘం ఆమోదించి... రికార్డుల్లో ఎక్కిస్తుంది. తద్వారా భవిష్యత్తులో పార్టీలో ఏమైనా అంతర్గత సమస్యలు ఉత్పన్నమైన సమయంలో... సమర్పించిన రాజ్యాంగం ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. అందుకే.. రాజ్యాంగం విషయంలో పార్టీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తుంటారు. మధ్యలో చేసిన మార్పులు.. ఈసీ వద్ద అప్డేట్ చేయకపోతే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తుంటారు.

మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీ పేరు, గుర్తు విషయంలో.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి, సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. ఫిర్యాదులపై పరిశీలన జరిపిన ఈసీ... శివసేన పేరు, పార్టీ ఎన్నికల గుర్తు "విల్లు - బాణం" .. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతాయని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా.. ఈసీ కీలక అంశాలు ప్రస్తావించింది. పార్టీ పేరు, గుర్తు తమదేనని చెప్పుకోవడానికి ఠాక్రే వర్గం 2018 నాటి పార్టీ రాజ్యాంగం ఆధారపడుతోందని... కానీ, ఆ రాజ్యాంగ సవరణ గురించి ఎన్నికల సంఘానికి తెలియజేయలేదని పేర్కొంది. 2018లో చేసిన సవరణ తమ వద్ద రికార్డు కాలేదని తెలిపింది. పైగా.. అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి ఎలక్టోరల్ కాలేజ్ ని అధ్యక్షుడే నామినేట్ చేసేలా పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశారని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రకటించింది. షిండే వర్గానికి అనుకూలంగా ఈసీ నిర్ణయం వెలువడేందుకు పలు అంశాలు కారణమైనా.. అందులో పార్టీ రాజ్యాంగం అంశం కూడా ముఖ్యమైనది కావడం గమనార్హం.

వైఎస్సార్సీపీ పై దృష్టి సారించిన ఈసీ...

ఇక.. కేంద్రం ఎన్నికల సంఘం తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్సీపీపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. గతేడాది జూలైలో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించిన వైఎస్సార్సీపీ... వైఎస్ జగన్‌ని జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించింది. అధ్యక్ష నియామకంలో మార్పులతో పాటుగా పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు కూడా ప్లీనరీ ఆమోదం తెలియజేసింది. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ -1 ప్రకారం... యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్సార్సీపీగా మారుస్తూ తీర్మానం చేశారు. ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన ఈసీ... రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడి నియామకం అప్రజాస్వామికమని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం చెల్లదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం.. ఏ పార్టీలో కూడా శాశ్వత అధ్యక్షులు ఉండరంది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అభిప్రాయపడింది. అలాంటి ఎన్నిక నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికలు జరగాలని సూచించింది. రాజకీయ పార్టీలు చేసే అప్రజాస్వామిక సవరణలను గుర్తించేది లేదంది. ఈ మేరకు... వివరణ ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపింది.

ఈసీ నోటీసులతో వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షుడి విషయంలో యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు నోటీసులకి సమాధానం ఇచ్చిన ఏపీ అధికార పార్టీ.... తమ పార్టీలో శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక జరగలేదని వివరణ ఇచ్చింది. జగన్ ను కేవలం 5 ఏళ్ల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని.. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో ప్రకటించారు. జగన్ ను పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా చేయాలన్నది కేవలం నాయకుల అభిలాష మాత్రమే అని... అయితే ఈ ప్రతిపాదనను సీఎం జగన్ ఆదిలోనే తిరస్కరించారని చెప్పారు. మరింత వివరణాత్మకంగా తెలిపేందుకు అంతర్గత కమిటీ వేసి నివేదికను ఈసీకి అందిస్తామని తెలిపారు. అయితే... వైఎస్సార్సీపీ తమ పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలు ఇప్పటి వరకు ఈసీ రికార్డుల్లోకి ఎక్కలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే... ఇటీవల మహారాష్ట్రలో శివసేన పార్టీ విషయంలో వివాదానికి తెరదించిన కేంద్ర ఎన్నికల సంఘం.. మిగతా పార్టీల రాజ్యాంగంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీల నియమావళి, రాజ్యాంగంలో సవరణలకు సంబంధించి అందిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. వైఎస్సార్సీపీ పేరు మార్పు.. అధ్యక్షుడి ఎన్నికకి సంబంధించిన సవరణలను ఎన్నికల సంఘం అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారట. సవరణలు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా లేకపోతే.. వైఎస్సార్సీపీపై చర్యలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. పార్టీ పేరు మార్పు సహా పలు కీలక సవరణలపై పరిశీలన అనంతరం.. కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.