Sajjala On Viveka Murder: చంద్రబాబు కోరినట్టే సిబిఐ విచారణ జరుగుతోందన్న సజ్జల-ysrcp general secretary sajjala says cbi enquiry on viveka murder case moves in chandrababu direction ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp General Secretary Sajjala Says Cbi Enquiry On Viveka Murder Case Moves In Chandrababu Direction

Sajjala On Viveka Murder: చంద్రబాబు కోరినట్టే సిబిఐ విచారణ జరుగుతోందన్న సజ్జల

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 01:55 PM IST

Sajjala On Viveka Murder: వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. హత్య కేసులో సిబిఐ విచారణకు అవినాష్ హాజరైన నేపథ్యంలో సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జలరామకృష్ణారెడ్డి
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జలరామకృష్ణారెడ్డి

Sajjala On VivekaMurder 2019 ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. వివేకా హత్యలో బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయన్నారు.

ట్రెండింగ్ వార్తలు

వివేకాను కోల్పోవడం వైసీపీకి, జగన్ కు నష్టమేనని, వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని విమర్శించారు. కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారన్నారు. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకా గుండె పోటుతో చనిపోయారని తనకు చెప్పినట్లు ఆదినారాయణరెడ్డే చెప్పాడన్నారు.

హత్య తర్వాత వివేకా ఫోన్ లోని రికార్డులను ఎందుకు డిలీట్ చేశారని సజ్జల ప్రశ్నించారు. వివేకా హత్యకు రెండో పెళ్లికి సంబంధం ఉందని ఆంధ్రజ్యోతిలో రాశారని, కుటుంబ సభ్యులంతా కలిసి వివేకా చెక్ పవర్ తీసేశారని ఆంధ్రజ్యోతి చెప్పిందన్నారు.

వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది జగన్మోహన్ రెడ్డేనని, చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగిందని గుర్తు చేశారు. చంద్రబాబు కోరుకున్నట్లే ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. కడపకు చెందిన బీటెక్ రవి, ఆది నారాయణ రెడ్డి, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ రికార్డులు ఎందుకు చూడలేదని ప్రశ్నించారు.

శివశంకర్ రెడ్డి మా పార్టీ నాయకుడని, వైఎస్, వివేకాతో కలిసి పనిచేశారని చెప్పారు. శివశంకర్ రెడ్డి తప్పు చేయలేదని భావిస్తున్నామన్నారు. వివేకా హత్య కేసులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం చంద్రబాబుదేనని, సీబీఐ వెనుక రాజకీయ ప్రమేయం కచ్చితంగా ఉందన్నారు.

బీజేపీలో తన కోవర్టుల ద్వారా సీబీఐ విచారణను ప్రభావితం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు గతంలో వైఎస్ పై ఫ్యాక్షనిస్ట్ ముద్రవేసి కుట్రలు చేశారని, ఇప్పుడు వైఎస్ జగన్ పై కూడా కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు పకడ్బందీగా కథనం తయారు చేస్తారని, ఆ కథనాన్ని తన అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తారని, ఇదే అంశాన్ని టీడీపీ నాయకులు పదేపదే ప్రస్తావిస్తారని ఆరోపించారు.

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్ ను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని, గతంలో సిట్ రిపోర్ట్ లు బయటకొస్తే వాస్తవాలు బయటకొస్తాయని, కుట్రదారుల గోల్ న్యాయం జరగాలని కాదని, 2024 ఎన్నికల్లో లబ్ధి కోసం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. వివేకా కుటుంబంలో విభేదాలున్నాయని, వివేకా చుట్టూ నేరప్రవృతి ఉన్న మనుషులు ఉన్నారని సజ్జల అన్నారు.

వివేకాను హత్య చేసిన అసలు హంతకులను పట్టుకోవాలని, చంద్రబాబు అనుకూల మీడియాలో బ్యానర్లు కావాలన్నారు. గన్నవరంలో అల్లర్లకు కారణం చంద్రబాబేనని, పట్టాభిని గన్నవరం పంపిందే చంద్రబాబు అన్నారు. గన్నవరంలో దాడులను ప్రోత్సహించింది చంద్రబాబేనని సజ్జల ఆరోపించారు.

WhatsApp channel