లిక్కర్ కేసులో మరో పరిణామం - మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌…!-ysrcp ex mla chevireddy bhaskar reddy arrested liquor distilleries case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  లిక్కర్ కేసులో మరో పరిణామం - మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌…!

లిక్కర్ కేసులో మరో పరిణామం - మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌…!

ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చెవిరెడ్డి ఏ - 38గా ఉన్నారు. ఈ లిక్కర్ కేసులో భాగంగా మొత్తం ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు.

సిట్ అదుపులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు సిట్ విచారణ వేగవంతం చేస్తుండటంతో పాటు మరోవైపు అరెస్టులపర్వం కూడా కొనసాగుతోంది. తాజాగా ఇదే కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది.

ఏ 38గా చెవిరెడ్డి పేరు…!

బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు వెంకటేశ్‌నాయుడిని (ఏ-34) కూడా అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఏ -38గా చేర్చారు . తాజాగా జరిగిన అరెస్టులతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 9 మందిని సిట్ అరెస్ట్ చేసింది. మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ ఆఫీస్‌కు తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారించే అవకాశం ఉంది. ఆపై కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. ఇక ఈ కేసులో చెవిరెడ్డి కుమారుడైన మోహిత్ రెడ్డి పేరును కూడా సిట్ చేర్చింది. ఆయన్ను ఏ 39గా పేర్కొంటూ కోర్టులో మంగళవారం మెమో దాఖలైంది.

ఏపీ లిక్కర్ కేసు రాజ్ కసిరెడ్డి చుట్టూ తిరుగుతోంది. అయితే ఆయనకు అందిన ముడుపుల్లో కొంతమేరు చెవిరెడ్డికి కూడా అందినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆ డబ్బులను గత ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులకు చేరవెశారన్న అభియోగాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కోణంలోనే చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు… లిక్కర్ కేసుకు సంబంధించి లోతుగా విచారించే అవకాశం కనిపిస్తోంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.