ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను పరామర్శిచటం తప్పా అని నిలదీశారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి… ఆంక్షలు విధించటమేంటని ప్రశ్నించారు. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య తన పర్యటన జరిగిందన్నారు. అసలు చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు.
“పొదిలిలో 40,000 మంది వైసీపీ కార్యకర్తలను, రైతులను అడ్డుకునేందుకు 40 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారు అదే 40,000 మంది 40 మంది మీద దాడి చేస్తే ఎలా ఉండేది…? దాడికి ప్రేరేపించింది టీడీపీ వాళ్ళైతే, కేసులు రైతుల మీద పెట్టించారు. నా రెంటపాళ్ల పర్యటన కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య జరిగింది. అయినా విజయవంతమైంది” అని వైెఎస్ జగన్ తెలిపారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా..? అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాపిక్ డైవర్ట్ చేయడానికే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వనని అన్నందుకు చెవిరెడ్డి గన్‌మెన్‌ను హింసించారని జగన్ ఆరోపించారు. ఆ గన్‌మెన్ స్వయంగా డీజీపీ, రాష్ట్రపతికి లేఖలు రాశారని గుర్తు చేశారు. లిక్కర్ కేసులో ఏడాదిగా చెవిరెడ్డి భాస్కర్ పేరే లేదన్నారు.
ఇరికించాలనుకుంటే ఎవరినైనా ఇరికించొచ్చని… లేని ఆధారాలను తయారు చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని బిహార్‌ను చేయడంలో చంద్రబాబుకు మించిన గొప్ప నాయకుడు ఎవరూ లేరని దుయ్యబట్టారు.
సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు ధ్వంసం చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోందని జగన్ ప్రశ్నించారు. ఈరోజు సాక్షి టార్గెట్‌గా దాడులు చేశారని… రేపటి రోజున మరొకరిపై దాడులు చేస్తారా? అని ఆక్షేపించారు. ఇది ఇలాగే కొనసాగితే ఎలా? ప్రజాస్వామ్యం అనేది ఏపీలో ఉందా?మీరు చేస్తున్నది తప్పుడు సాంప్రదాయం కదా..? ఇలాగే కొనసాగితే ఎవరైనా బ్రతకగలరా అంటూ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
“అనంతపురం జిల్లాలో ఇంటర్ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు...తర్వాత బాలిక శవమై కనిపించింది. ఇలాంటి ఘటనలు మీద దర్యాప్తు చేయాలనే ఆలోచన ఉందా” అని కూటమి ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. మీడియా సమావేశం సందర్భంగా… పెద్దిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసుల విషయాలను జగన్ ప్రస్తావించారు.
ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయని జగన్ విమర్శించారు. సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఒక సంవత్సర కాలంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత రావడం దేశ చరిత్రలోనే తొలిసారని వ్యాఖ్యానించారు.
తన పర్యటనలో భాగంగా పుష్ప మూవీ డైలాగ్ లతో కూడిన బ్యానర్లను ప్రదర్శించటంపై జగన్ స్పందించారు. పుష్ప సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా…? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా ? అంటూ బదులిచ్చారు.
గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం.. అని వైఎస్ జగన్ తొలుత డైలాగ్ చెప్పారు. పుష్ప సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజరం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు?. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? అని జగన్ ప్రశ్నించారు. అంతేకాదు మీడియా ప్రతినిధులతోనే ఆ డైలాగ్ ను ప్రస్తావించారు.
“2029లో వైఎస్సార్‌సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం అని ఓ ప్లకార్డ్ ప్రదర్శించారు. ఆ వ్యక్తి పక్కా టీడీపీ మనిషి అని తేలింది. గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు. చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు.. ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమో” అంటూ వైఎస్ జగన్ మీడియా సమావేశాన్ని ముగించారు.
వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. “రపరపా పొట్టేళ్లను నరికినట్టు నరుకుతారా.. వైఎస్ జగన్? మీ అభిమానస్తుడి భాషను మీరు సమర్థిస్తుండడం దేనికి సంకేతం? ప్రజాస్వామ్యానికి మీ ధోరణి చాలా ప్రమాదకరం” అంటూ ట్వీట్ చేశారు.