YCP BC Leaders Meeting : డిసెంబరు 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం-ysrcp bc public representatives meeting on december 8th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ycp Bc Leaders Meeting : డిసెంబరు 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం

YCP BC Leaders Meeting : డిసెంబరు 8న బీసీల ఆత్మీయ సమ్మేళనం

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 07:49 AM IST

YCP BC Leaders Meeting ఆంధ‌్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలన్నిబీసీ జపం చేస్తున్నాయి. శనివారం తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు డిసెంబర్ 8న బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటిని సిఎం నెరవేరుస్తున్నారని, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్న నాయకుడు జగన్ అని బీసీ మంత్రులు కొనియాడుతున్నారు. రాజకీయ పార్టీలన్ని బీసీ కులాలకు గాలం వేయడంలో వేగం పెంచినట్లు కనిపిస్తోంది.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్

YCP BC Leaders Meeting ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలన్ని బీసీల వెంటపడుతున్నాయి. బీసీల ఐక్యత గురించి జనసేన మాట్లాడుతుంటే మరో వైపు బీసీలకు మునుపెన్నడు లేని విధంగా వైసీపీ మేలు చేసిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. శనివారం తాడేపల్లిలో బీసీ మంత్రులు, కీలక నేతలు సమావేశమై బీసీ డిక్లరేషన్‌పై చర్చించారు.

గతంలో బీసీ డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి మాటను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని మంత్రులు ప్రకటించారు. చెప్పిన హామీలతోపాటు చెప్పనివి కూడా అమలు చేస్తున్న నాయకుడు జగన్ అని, బీసీలకు డీబీటీ ద్వారా మూడున్నరేళ్ళలో రూ. 86 వేల కోట్లకు పైగా అందించామని వైసీపీ నాయకులు చెబుతున్నారు. బీసీలంతా క్విట్ బాబూ.. అని అంటున్నారని బీసీ ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో చెప్పారు.

డిసెంబరు 8 వతేదీన బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించినట్లు బీసీ మంత్రులు ప్రకటించారు. వైసీపీ బీసీ నాయకులు నిర్వమించిన సమావేశంలో చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యేలు కె. పార్థసారథి, అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు వారు తెలిపారు.

జగన్ మోహన్ రెడ్డి మూడున్నరేళ్ళ పరిపాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును గుర్తు చేసుకుంటూ, గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ బీసీ ప్రజాప్రతినిధులంతా కలిసి, ఒక పండుగ వాతావరణంలో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అందుబాటులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ బీసీ నాయకులు పార్టీ పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, మూడున్నరేళ్ళ పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలు, బీసీల జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయి, గ్రామ స్థాయి నుంచి బీసీ వర్గాలకు పెరిగిన రాజకీయ ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించామని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 672 మంది డైరెక్టర్లను నియమించామని, ప్రభుత్వ కార్పొరేషన్లలో కూడా 122 మందిని బీసీలను నియమించినట్లు చెప్పారు. బీసీ కార్పొరేషన్లు ఏర్పడి కూడా రెండేళ్ళు పూర్తవుతుందని ఈ నేపథ్యంలో డిసెంబరు 8 న బీసీల ఆత్మీయ కలయిక సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ల ఛైర్మెన్లు, మెంబర్లు, ఆలయ కమిటీల ఛైర్మన్లు, డైరెక్టర్లు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మెన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యుల వరకు అందర్నీ ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

బీసీలకు సంబంధించి ఒక పండుగ వాతావరణంలో.. బీసీలకు ఈ ప్రభుత్వం ఎంత అండగా ఉంటుందో, సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా బీసీ వర్గాలకు ఒక భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సమావేశంలో తెలియచేస్తామన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చినట్టు, కుల వృత్తిలో ఉన్నవారికి ఒక పనికిరాని పనిముట్టు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదని బీసీల అవసరాలను గుర్తించి... వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. అందుకే చంద్రబాబును బీసీలంతా క్విట్ బాబూ అంటున్నారన్నారు.

రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా, బీసీలను గుర్తించి, బీసీలకు మేలు చేసింది జగన్మోహన్‌ రెడ్డి కాబట్టి.. బీసీ సమాజం అంతా ఆయనకు అండగా నిలబడుతున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు.

పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే, తన సుదీర్ఘ పాదయాత్రలో బీసీల స్థితిగతులను గుర్తించి, వారి జీవన ప్రమాణాలపై ఒక కమిటీ వేసి, అధ్యయనం చేయించిన నాయకుడు జగన్ అని, ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ప్రకటించారని, అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి అంశాన్నీ ఈ ప్రభుత్వం అమలు చేసిందన్నారు.

మూడున్నరేళ్ళలో ఈ ప్రభుత్వం రూ. 1.76 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే.. అందులో 50 శానికి పైగా, అంటే రూ. 86 వేల కోట్లకు పైగా బీసీలకు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎవర్నీ దేబిరించాల్సిన అవసరం లేకుండా బీసీలకు పలు సంక్షేమ పథకాల ద్వారా.. ఒక్క బటన్ నొక్కి, దాదాపు రూ. 86 వేల కోట్లు మూడున్నరేళ్ళలో ఇచ్చారని ఎంపీ మార్గాని భరత్ చెప్పారు చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్