DL Ravindra Reddy : ముప్పు ఉంది, జాగ్రత్త ఉండండి.. విజయమ్మ, షర్మిలకు మాజీ మంత్రి డీఎల్ హెచ్చరిక
DL Ravindra Reddy : మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కోడికత్తి, వైఎస్ వివేకా హత్య మాదిరిగా మరో ఘటన జరిగే అవకాశం ఉందని డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
DL Ravindra Reddy : సీఎం జగన్ నుంచి ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు ముప్పు ఉందని మాజీ మండ్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఏదైనా తీవ్ర ఘటన జరిగే అవకాశం ఉందన్నారు. వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని, వారిద్దరూ జాగ్రత్తగా ఉండాలని డీఎల్ రవీంద్రారెడ్డి హెచ్చరించారు. మరోసారి ఎన్నికల్లో గెలిచేందుకు కోడికత్తి కేసు, వివేకా హత్య మాదిరిగా...మరో ఘటన జరిగే అవకాశం ఉందన్నారు. విజయమ్మ, షర్మిల కదలికలను భద్రతా సిబ్బంది జగన్‌కు చేరవేస్తు్న్నారన్నారు.
భారతీరెడ్డి రాజ్యాంగం
మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ ఎంతటి దారుణానికైనా దిగజారుతారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. తనకు తెలిసిన సమాచారం మేరకు ఎన్నికల సమయంలో ఆయన అనుచరులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతంలో ప్రశాంత్ కిషోర్ సూచనలు వర్క్ అవుట్ అవ్వడంతో మరోసారి ఎవరి గొంతైనా కోసే అవకాశం ఉందన్నారు. మరో ఇద్దరిని మర్డర్ చేస్తేగానీ మళ్లీ అధికారంలోకి రాలేమన్న ఆలోచనలో జగన్ ఉన్నారని డీఎల్ ఆరోపించారు. కోడికత్తి, వివేకా హత్య కేసులతో జగన్ అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి రాజ్యాంగం నడవడం లేదని, తాడేపల్లి నుంచి వైఎస్ భారతీరెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు.
శిక్ష నుంచి తప్పించుకోలేరు
వైఎస్ భారతీరెడ్డి ఆదేశాల మేరకు వివేకా హత్య కేసు విచారణ వాయిదాలు పడుతుందని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఈ కేసు నుంచి ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. తండ్రీకొడుకులు సాక్ష్యాధారాలు మాఫీ చేసేందుకు ప్రయత్నం చేశారనే అభియోగాలు కూడా ఉన్నాయన్నారు. సీబీఐ దర్యాప్తు అధికారులను మార్చినంత మాత్రాన శిక్ష నుంచి తప్పించుకోడానికి అవకాశంలేదన్నారు. వైఎస్ వివేకాపై నీచాతినీచంగా కోర్టుల్లో తప్పుడు పిటిషన్లు దాఖలు చేస్తున్నారని డీఎల్ మండిపడ్డారు
సంబంధిత కథనం