YSR Health University: ఏపీలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు, మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు-ysr health university canceled pg medical counseling in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Health University: ఏపీలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు, మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు

YSR Health University: ఏపీలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు, మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు

HT Telugu Desk HT Telugu

YSR Health University: ఏపీలో పీజీ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు చేస్తున్నట్లు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ ప్రకటించింది. పీజీ సీట్ల పెంపుపై నకిలీ అనుమతులు వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యలో యూనివర్శిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

పీజీ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు

YSR Health University: ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్శిటీ పీజీ మెడికల్ కౌన్సిలింగ్ మళ్లీ రద్దైంది. ఏపీలోని పలు మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల భర్తీలో ఎన్‌ఎంసి నుంచి నకిలీ అనుమతులు మంజూరు కావడం వెలుగు చూసిన నేపథ్యంలో కౌన్సిలింగ్ రద్దు చేస్తున్నట్లు యూనివర్శిటీ ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రెండో దఫా రివైజ్డ్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది.

యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం నీట్ అర్హత సాధించిన అభ్యర్ధుల నుంచి మళ్లీ వెబ్‌ఆప్షన్లు స్వీకరించేందుకు గురువారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నీట్‌ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనవర్శిటీ అధికారులు సూచించారు.

అనివార్య కారణాలతో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ పేరిట శాంతీరామ్, జీఎస్‌ఎల్, మహారాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు జారీ చేసినట్లు ధృవీకరణలు వెలుగు చూసిన నేపథ్యంలో మొదటి విడత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసింది. ఆ తర్వాత గత సోమవారం రివైజ్డ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మంగళవారం రాజమండ్రి కాలేజీలో నకిలీ అనుమతులు వెలుగు చూశాయి.

రాజమండ్రి జీఎస్‌ఎల్‌ కళాశాలలో పీజీ రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్‌ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. ఈ వ్యవహారంపై ఢిల్లీలో పోలీస్ కేసు నమోదైంది.

వరుసగా నకిలీ అనుమతులు వెలుగు చూడటంతో యాజమాన్య కోటా రివైజ్డ్‌ ఫేజ్‌-1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల భర్తీలో నకిలీ అనుమతుల వ్యవహారంపై ప్రభుత్వ వైఖరిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలేమిటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.