YSR Congress Party : వైసీపీకి వరుస షాకులు, ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న కీలక నేతలు-ysr congress party key leader leaving one by one alleged high command jagan not responding ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Congress Party : వైసీపీకి వరుస షాకులు, ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న కీలక నేతలు

YSR Congress Party : వైసీపీకి వరుస షాకులు, ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న కీలక నేతలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 26, 2025 02:59 PM IST

YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపరకొనసాగుతోంది. కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం సైలెంట్ ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కష్టాల్లో ఉంటే పార్టీ తమను పట్టించుకోవడంలేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

వైసీపీకి వరుస షాకులు, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న కీలక నేతలు
వైసీపీకి వరుస షాకులు, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న కీలక నేతలు

YSR Congress Party : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం... 11 సీట్లకే పరిమితమవ్వడం వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గ్రాఫ్ ను చక్కదిద్దే పనులు వైసీపీ చేస్తుందా? అంటే లేదనే చెప్పాలి. ఇక తాజా పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఎన్నికల సమయానికి అసలు పార్టీలో ఎవరుంటారో? లేరో? అనే సందేహం కలుగుకుతుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో కీలక నేతలంతా సైలెంట్ అవ్వడం, ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండడంతో...పార్టీ పరిస్థితిపై అంతర్గత చర్చ మొదలైందని సమాచారం.

విజయసాయి రెడ్డి రాజీనామాతో

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి వైసీపీని వీడడం, రాజకీయాలకు గుడ్ బై చెప్పడం..ఆ పార్టీకి అతిపెద్ద దెబ్బ. ఆయన తర్వాత ఇంకెంత మంది పార్టీని వీడుతారో? అనే సందేహాలు మొదలయ్యాయి. వైసీపీలో ఒకప్పుడు విజయసాయి రెడ్డి నెంబర్ 2గా ఉండేవారు.

పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా, చాలా కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి విజయసాయిరెడ్డి కూడా ఒక కారణంగా చెబుతారు. వైఎస్ జగన్ కుటుంబానికి చాలా సన్నిహితుడైన విజయసాయిరెడ్డి సడెన్ గా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనుక పెద్ద కారణమే ఉందనే ప్రచారం జరుగుతోంది.

మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాస్, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ , వాసిరెడ్డి పద్మ... ఒక్కొక్కరిగా కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. బయట నుంచి ఒత్తిళ్లు, పార్టీలో పరిస్థితులతో వీరంతా వైసీపీని వీడినట్లు తెలుస్తోంది.

వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ తమ పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీల్లో చేరిపోయారు. రాజ్యసభలో 2024 ఎన్నికల సమయానికి 11 ఎంపీ సీట్లు ఉన్న వైసీపీ బలం క్రమంగా తగ్గుతోంది. విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 7కు తగ్గింది. త్వరలో మరికొంద మంది విజయసాయిరెడ్డి బాటలో నడుస్తారని తెలుస్తోంది.

పార్ట్ టైమ్ పాలిటిక్స్

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పార్టీ టైమ్ పొలిటీషియన్స్ అని వైఎస్ జగన్ విమర్శలు చేశారు. వారికి రాష్ట్రంలో కనీసం సొంత ఇల్లు లేదని, హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తు్న్నారని విమర్శించారు. వారు ప్రజలకు అందుబాటులో ఉండరని సెటైర్లు వేశారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఆయన తరచూ బెంగళూరు వెళ్లిపోతున్నారు.

పార్టీ క్యాడర్, కీలక నేతలకు అందుబాటులో ఉండడంలేదనే విమర్శలు వస్తున్నారు. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తానన్న వైఎస్ జగన్.. ఇంకా తన పర్యటనపై స్పష్టత ఇవ్వలేదు. వైసీపీ కనీసం ప్రతిపక్షంగా కూడా పనిచెయ్యట్లేదనే విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోవడం, ప్రధాన సమస్యలపై స్పందించకపోవడం, మీడియాకు ముఖం చాటేయ్యడంతో పార్టీని మరింత బలహీనం చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మైక్ కనిపిస్తే ప్రతిపక్షంపై విరుచుకుపడే నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు..ఇలా కీలక నేతలంతా మౌనం వహిస్తు్న్నారు. అంబటి రాంబాబు, ఆర్కే రోజా అడపాదడపా మీడియా ముందుకు వస్తున్నా...గతంలో ఉన్నంత వాడి, వేడి వీరి వ్యాఖ్యల్లో కనిపించడంలేదు.

కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని అయితే పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీలో పరిస్థితులను అధిష్టానం నిశితంగా పరిశీలిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. త్వరలోనే జగన్ రంగంలోకి దిగుతారని పార్టీ నేతలు అంటున్నారు. జగన్ విదేశాల నుంచి తిరిగి రాగానే పరిస్థితులను చక్కదిద్దుతారని చెబుతున్నారు.

Whats_app_banner