YS Vijayamma : ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం- వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పేవి అవాస్తవాలు : వైఎస్ విజయమ్మ-ysr assert issue ys vijayamma letter support sharmila alleged ys subbareddy vijayasai reddy words no true ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Vijayamma : ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం- వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పేవి అవాస్తవాలు : వైఎస్ విజయమ్మ

YS Vijayamma : ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం- వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పేవి అవాస్తవాలు : వైఎస్ విజయమ్మ

Bandaru Satyaprasad HT Telugu
Oct 29, 2024 07:00 PM IST

YS Vijayamma Letter : వైఎస్ఆర్ ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ సంచలన లేఖ రాశారు. ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం జరిగిందన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డికి అన్నీ తెలిసి అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. ఇద్దరూ తన బిడ్డలే అని, అయినా ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తున్నారన్నారు.

ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం- వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పేవి అవాస్తవాలు : వైఎస్ విజయమ్మ
ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం- వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పేవి అవాస్తవాలు : వైఎస్ విజయమ్మ

YS Vijayamma Letter : వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ స్పందించారు. వైఎస్ఆర్ అభిమానులకు ఆమె బహిరంగ లేఖ రాశారు. వైఎస్ఆర్ ఆస్తుల వివాదంపై జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తన మనసుకి చాలా బాధేస్తుందన్నారు.

"నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితులను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనవి అన్ని నా కళ్ల ముందే జరిగి పోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. తెలిసి కొంత తెలియకుండా కొంత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవి దావాలనంగా ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఇకపై అవి కంటిన్యూ అవ్వకూడదు. అది నా పిల్లలిద్ధరికే కాదు.. చెప్పాలంటే రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను ఈ విషయంగా మీ ముందుకు రాకూడదని అనుకున్నాను. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది" -వైఎస్ విజయమ్మ

మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నానని విజయమ్మ అన్నారు. దయచేసి నా కుటుంబం గురించి, పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నానన్నారు. సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు, దూషణలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దని కోరారు. వారిద్దరూ సమాధానపడతారు. మీరెవరు రెచ్చ గొట్టవద్దని కోరారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు.

వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పేవి అసత్యాలు

"వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇతరులు... వాళ్లు మాట్లాడుతున్నది వైఎస్ఆర్ గురించి అని మరిచి, ఆయన కుటుంబ పరువు తీస్తున్నారన్న స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎస్ఆర్ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్ఆర్ పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుంచి, కొన్ని ఆస్తులు షర్మిల పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. వైఎస్ఆర్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు, జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ అంటూ కొందరు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే" - విజయమ్మ

"విజయసాయి రెడ్డి ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారు. అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్దాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్నాను. వీళిద్దరూ నా పిల్లలు. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఆస్తులు ఉండాలన్న వైఎస్ఆర్ మాట నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. వైఎస్ఆర్ చివరి రోజుల్లో, జగన్ ఆయనకు ఇచ్చిన మాట... నాన్న నీ తర్వాత ఈ లోకంలో, షర్మిల మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని అని జగన్ మాట ఇచ్చింది కూడా నిజం" - వైఎస్ విజయమ్మ

విజయమ్మ లేఖలో ప్రస్తావించిన అంశాలు

రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. అన్ని కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకొనే సరికి, ఆయన ప్రమాదంలో వెళ్లిపోయారు. ఈ విషయం ఆడిటర్ గా సాయి రెడ్డికి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక.. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, రూ.200 కోట్లు షర్మిల వాటాగా ఇచ్చారు. MOU ప్రకారం జగన్ 60 శాతం.. షర్మిలకు 40 శాతం అయితే, MOU కు ముందు...సగం సగం డివిడెండ్ తీసుకొనే వారు. ఎందుకంటే షర్మిలకు సమాన వాట ఉంది కాబట్టి. వీటి అన్నింటికీ అప్పుడు, ఇప్పుడు, నేనే సాక్షిని.

2019లో సీఎం అయిన రెండు నెలలకు ఆస్తులు డివైడ్ చేయాలని జగన్ ప్రపోజల్ పెట్టారు. జగన్ చెప్పింది ఏంటంటే... ”పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు..నాకు అల్లుళ్లు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు. మనం కలిసి ఉన్నట్లు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు. కాబట్టి విడిపోదాం” అన్నారు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో నా సమక్షంలో ఆస్తుల్లో ఇవి జగన్ కి, ఇవి షర్మిలకి అని అనుకున్నారు. 2019లో అప్పుడు రాసిన MOU నే ఈ MOU. ఇది జగన్ నోటితో చెప్పి.. ఆయన చేతితో రాసిన MOU. హక్కు ఉంది కాబట్టే షర్మిలకి రూ.200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు.

జగన్ గిఫ్టుగా ఇస్తున్నవి కావు

షర్మిలకు హక్కు ఉంది కాబట్టే ఎంవోయూ రాసుకున్నారు. ఎంవోయూలో షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యతగా ఇస్తున్నవి. అటాచ్ మెంట్ లో లేవు కాబట్టి ఎంవోయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎంవోయూలో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, షర్మిల వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టారు. ఇవి కూడా ఇవ్వకుండా.. ఆటాచ్ మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా షర్మిలకు అన్యాయం జరిగింది. షర్మిల భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్నాము. షర్మిలమ్మను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా షర్మిలమ్మ పాలిటిక్స్ లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి షర్మిల కృషి ఎంతో ఉంది.

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే, చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం. ఇంత మంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్దాల మధ్య నిజం తెలియాలనే.. ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే... అయినప్పటికీ, వాళ్లు ఇద్దరు అన్నా చెల్లెళ్లు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు.' అని లేఖలో విజయమ్మ ప్రస్తావించారు.

Whats_app_banner