Sunitha On Avinash Reddy Bail :వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను వివేకా కుమార్తె సునీత రెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్ ముందస్తు బెయిల్ ను రద్దుచేయాలని సునీత కోర్టును కోరారు. అవినాష్ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సునీత సుప్రీంలో సవాల్ చేశారు. అవినాష్ పై మోపిన అభియోగాలన్నీ గంభీరమైనవేనని సునీత రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా సునీత పిటిషన్ లో పేర్కొన్నారు. అవినాష్ ముందస్తు బెయిల్ ను సీబీఐ వ్యతిరేకిస్తుంది. సునీత పిటిషన్ పై విచారణ సందర్భంగా సీబీఐ సుప్రీంలో వాదనలు వినిపించనుంది. రేపు సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ పై విచారణకు జరిగే అవకాశం ఉంది.
ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని, సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఏప్రిల్ 19 నుంచి అవినాష్ రెడ్డి అరెస్ట్‌పై ఉత్కంఠ కొనసాగింది. గతంలో ఏడు సార్లు సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఆ తర్వాత రకరకాల కారణాలతో విచారణ వాయిదా వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి తల్లి అస్వస్థతకు గురికావడంతో పులివెందుల నుంచి ఆమెను కర్నూలు చికిత్స కోసం తరలించారు. సీబీఐ విచారణకు హాజరు కాలేనంటూ అవినాష్ రెడ్డి చివరి నిమిషయంలో కర్నూలు వెళ్లిపోయారు. దీంతో అవినాష్‌ను సీబీఐ అరెస్ట్ చేయడానికి సిద్దమైందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సీబీఐ ఆయనను అరెస్టు చేయలేదు. ఈ నాటకీయ పరిణామాల మధ్య హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గత శనివారం సీబీఐ విచారించింది. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. వివేకా హత్య రోజు అవినాష్ రెడ్డి వాట్సాప్ కాల్స్‌పై సీబీఐ విచారించింది. అదేవిధంగా అవినాష్ రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో ఇటీవల ఎంపీ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య జరిగిన అర్ధరాత్రి టైంలో అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్‌గా ఉందన్న అంశాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో సీబీఐ ప్రస్తావించింది. దీనిపై అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాట్ సంబంధించిన అంశాలపైన సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.